కేంద్రమంత్రి
శరద్ పవార్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల జగన్ వ్యూహాత్మకంగా
తన బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు
నుండి వెనక్కి తీసుకున్నారనే ప్రచారం జోరుగా జరిగిన విషయం తెలిసిందే. అయితే
జగన్‌కు కాంగ్రెసు పెద్దల
అండ ఉన్నా లేకపోయినా కేంద్రమంత్రి,
నేషనలిస్ట్ కాంగ్రెసు పార్టీ అధినేత శరద్ పవార్ అండ
మాత్రం ఉందని చెబుతున్నారు.
పవార్
కూడా ముందు చూపుతోనే జగన్‌కు దన్నుగా నిలుస్తున్నారని
అంటున్నారు. ప్రస్తుతానికి యుపిఏలో సంక్షోభం సమసిపోయినప్పటికీ రాష్ట్రపతి ఎన్నికల తర్వాత పవార్ కాంగ్రెసు పార్టీని
తన డిమాండ్లతో చెమటలు కక్కించారు. యుపిఏలోని భాగస్వామ్య పక్షాలన్నింటికీ ప్రాధాన్యత ఇవ్వాలని, కాంగ్రెసు మాత్రం ఒంటెత్తు పోకడతో వెళుతోందని ఎన్సీపి ఘాటైన విమర్శలు చేసింది.
అయితే పవార్ డిమాండ్లలో కొన్నింటికి
తలొగ్గిన కాంగ్రెస్ సమస్యను పరిష్కరించింది.
పవార్
యుపిఏ కలకలం, జగన్‌కు మద్దతు
పలకడం అంతా వ్యూహాత్మకంగా జరుగుతోందని
అంటున్నారు. 2014 ఎన్నికలలో ఆయన ప్రధాని పీఠంపై
కన్నేశారని చెబుతున్నారు. అందుకోసం ఆయన ఇప్పటి నుండే
పావులు కదుపుతన్నారట. కరుణానిధి, మమతా బెనర్జీ, బాల్
థాకరే, వైయస్ జగన్ వంటి
తదితరులను ఇప్పటి నుండి కూడగట్టుకొని 2014 ఎన్నికలలో
ప్రధాని పీఠమెక్కాలని ఆయన భావిస్తున్నారట.
మహారాష్ట్రలో
ఆయన శివసేనను ఆయన ఇప్పటికే మచ్చిక
చేసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో ప్రణబ్ ముఖర్జీ ఆ పార్టీ ఓటు
వేయడం వెనుక పవార్ హస్తమే
ఉందట. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెసుపై
గుర్రుగా ఉన్నారు. పరిస్థితి తనకు అనుకూలంగా లేకపోవడంతో
ఆమె చేసేది లేక కాంగ్రెసును అనుసరిస్తున్నారు.
ఆమె అసంతృప్తిని కూడా పవార్ 2014లో
క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు.
ఇక డిఎంకేకు కూడా కాంగ్రెసు పట్ల
2జి కుంభకోణం కేసు విషయమై అసంతృప్తి
ఉంది. వారిని కూడా పవార్ తనకు
అనుకూలంగా బుజ్జగిస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్
రాజకీయాల్లో ఒక్కసారిగా ఎగిసిన వైయస్ జగన్ పైన
కూడా పవార్ దృష్టి సారించారని
అంటున్నారు. తాను పీఠం ఎక్కేందుకు
జగన్‌కు ఇప్పటి నుండే
సపోర్ట్ చేస్తున్నారని అంటున్నారు. ఇటీవల సుప్రీం కోర్టులో
బెయిల్ వెనక్కి తీసుకోవడం వెనుక ఆయన సూచనలే
ఉన్నాయని చెబుతున్నారు.
ప్రణబ్
ముఖర్జీకి రాష్ట్రపతి ఎన్నికలలో జగన్ పార్టీ ఓటేయడంపై
తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి ఘాటైన విమర్శలు
చేసిన విషయం తెలిసిందే. వోట్
ఫర్ బెయిల్ అని ఆ రెండు
పార్టీలు మండిపడ్డాయి. ప్రణబ్‌కు జగన్ పార్టీ
ఓటు వెనుక కూడా పవారే
ఉన్నారట. అయితే జగన్ ప్రణబ్‌కు ఓటేసినప్పటికీ కాంగ్రెసు
ఆయనను మన్నిస్తుందో లేదో మాత్రం తెలియకుండా
ఉందని చెబుతున్నారు. జగన్ ఓటేసిన నేపథ్యం
ఏదయినప్పటికీ.. ఆయన పార్టీచే ఓటేయించిన
పవార్ 2014 ఎన్నికలలో తమను కాదని ప్రధాని
పీఠంపై కన్నేయడం నచ్చని కాంగ్రెసు పెద్దలు జగన్ పైన కరుణ
చూపించే అవకాశం లేదని అంటున్నారు.
0 comments:
Post a Comment