హైదరాబాద్:
కాంగ్రెసు పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలన్నా,
తెలుగుదేశం గత వైభవాన్ని తిరిగి
పొందాలన్నా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలో నిలదొక్కుకోవాలన్నా ఒక్కో పార్టీ ఒక్కో
నేతను ఖచ్చితంగా తలవాల్సిందే. వారి నామస్మరణ లేకుంటే
ఆ పార్టీలు మనుగడ సాధించలేని పరిస్థితి
ఏర్పడిందని చెప్పవచ్చు. ఆ ముగ్గురే.. దివంగత
ప్రధాని ఇందిరా గాంధీ, స్వర్గీయ ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు, వైయస్
రాజశేఖర రెడ్డిలు.
కాంగ్రెసు
ఇందిరమ్మను, టిడిపి ఎన్టీఆర్‌ను, జగన్ పార్టీ
వైయస్సార్‌ను తలవని రోజు
ఉండదనే చెప్పవచ్చు. కొన్ని సందర్భాలలో ఓ పార్టీ నేతలు
ఇతర పార్టీ నేతలను పొగడటం కూడా జరుగుతోంది. ఇదంతా
రాజకీయ ఎత్తుగడ అయినప్పటికీ ఆ ముగ్గురిని స్మరించకుండా
ఆయా పార్టీలు మాత్రం ఉండలేవు. కొన్ని సందర్భాలలో ఎన్టీఆర్‌ను వైయస్సార్ కాంగ్రెసు,
కాంగ్రెసు పార్టీలు కూడా ఇప్పుడు పొగుడుతుంటాయి.
నిత్యం
ఇందిరమ్మ జపం చేసే కాంగ్రెసు
ఇటీవల కాలంలో వైయస్ పేరును ఉపయోగించుకునే
విషయంలో తర్జన భర్జన పడుతోంది.
ఈ విషయంపై ఆ పార్టీలో ఇంకా
ఓ క్లారిటీ రాలేదు. ఇప్పటికీ కొందరు వైయస్‍ను విమర్శిస్తుండగా మరికొందరు
సమర్థిస్తుంటారు. ఇక తెలుగుదేశం పార్టీ
ఎన్టీఆర్ పేరును మాత్రమే పల్లె వేస్తుంటుంది. ఆ
పేరు లేకుండా టిడిపి ఒక్క అడుగు కూడా
ముందుకేయదు.
ఇందిరమ్మ
పేరుతో బడుగు, బలహీన వర్గాలను మచ్చిక
చేసుకునేందుకు కాంగ్రెసు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటుంది. దివంగత వైయస్ కూడా తన
హయాంలో ఇందిర పేర పలు
పథకాలు ప్రవేశ పెట్టారు. అయితే వ్యూహాత్మకంగా అతను
ఇందిర పేరు తలుస్తూనే తన
వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
కూడా తాజాగా ఇందిర బాట పేరుతో
జిల్లాలు చుట్టి వచ్చే ఓ కార్యక్రమాన్ని
చేపట్టారు.
స్వర్గీయ
ఎన్టీఆర్ టిడిపిని పెట్టిన తర్వాతనే బిసిలకు రాజకీయంగా న్యాయం జరిగిందని, తెలంగాణలో దొరలు, రెడ్డిల నుండి ప్రజలకు విముక్తి
కలిగిందనే వాదన ఉంది. ఎన్టీఆర్
కారణంగానే బిసిలు తొలి నుండి టిడిపికి
అండగా నిలబడ్డారు. అయితే ఇటీవల వారు
జగన్ పార్టీ వైపు చూస్తున్నారని పరిశీలకులు
చెబుతున్నారు. అందుకే టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు
మరోసారి బిసి నినాదాన్ని గట్టిగా
ఎత్తుకున్నారని చెబుతున్నారు.
ఎన్టీఆర్
హయాం నుండి మద్దతు పలుకుతున్న
బిసిలు తమతోనే ఉండటం కోసమే ఇటీవల
చంద్రబాబు బిసి డిక్లరేషన్ ప్రకటించారు.
ఈ డిక్లరేషన్ పైన పలు బిసి
సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
టిడిపికి బిసిల అండ గట్టిగా
ఉందని చెప్పేందుకు ఇదే మంచి నిదర్శనం.
ఉప ఎన్నికల వరకు నిస్తేజంగా ఉన్న
టిడిపిలో బిసి డిక్లరేషన్ ప్రకటించగానే
మళ్లీ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
ఇక ఏడాది క్రితం పుట్టిన
జగన్ ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు నిత్యం వైయస్ పేరు స్మరిస్తోంది.
మొన్న జరిగిన ఉప ఎన్నికలలో ఆ
పార్టీ అంతటి భారీ విజయం
సాధించడం వెనుక ఆ పార్టీ
గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వైయస్
హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలు ప్రజలలో రేకెత్తించడం కూడా ఓ కారణం
అంటున్నారు. వైయస్ సెంటిమెంట్ లేకుంటే
ఆ పార్టీకి మనుగడే లేదని చెబుతున్నారు. అందుకే
వైయస్ సెంటిమెంట్ వచ్చే సాధారణ ఎన్నికల
వరకు ప్రజల్లో ఉంచేందుకు ఆ పార్టీ తీవ్ర
ప్రయత్నాలు చేస్తోందట.
జగన్
పార్టీ జెండాలో ఉన్న గుర్తులన్నీ వైయస్
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలే. ఇంకో విషయమేమంటే పార్టీ
పేరు వైయస్సార్ కాంగ్రెసు అయినప్పటికీ.. వైయస్సార్ అంటే దివంగత నేత
పేరు కాదు. యువజన శ్రామిక
రైతు కాంగ్రెసు పార్టీ అని. దీనిని షార్ట్‌గా వైయస్సార్ వచ్చేలా
పిలుస్తుంటారు. అందుకే టిడిపి నేతలు, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలు..
జగన్ పార్టీ నేతలకు వారి పార్టీ పూర్తి
పేరు చెప్పుకునే దమ్ము లేదని విమర్శలు
చేస్తుంటారు.
0 comments:
Post a Comment