తాజా
రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి
దగ్గరవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణపై స్పష్టత ఇస్తానని చంద్రబాబు నాయుడు ఈ మధ్య పదే
పదే చెబుతున్నారు. శుక్రవారం కరీంగనగర్ జిల్లా పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కూడా ఆయన అదే
విషయం చెప్పారు. తెలంగాణపై వచ్చే నెలలో చంద్రబాబు
స్పష్టత ఇచ్చి, కేంద్ర ప్రభుత్వానికి మరోసారి లేఖ పంపనున్నట్లు తెలుస్తోంది.
దీంతో తెరాస, తెలుగుదేశం పార్టీలు దగ్గర కావడానికి ప్రాతిపదిక
ఏర్పడుతుందని అంటున్నారు.
తెలంగాణ
రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు 2009 డిసెంబర్ 9వ తేదీన కేంద్ర
హోం మంత్రి పి. చిదంబరం ప్రకటన
చేసిన తర్వాత తెలంగాణకు వ్యతిరేకంగా జరిగిన పరిణాలపై తెరాస నాయకులు చంద్రబాబుపైనే
గురి పెట్టి విమర్శలు చేస్తూ వచ్చారు. చంద్రబాబును తెలంగాణద్రోహిగా అభివర్ణిస్తూ వచ్చారు. చంద్రబాబుపై కెసిఆర్ తీవ్రంగా విరుచుకుపడుతూ వచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీ
నాయకులు తెలంగాణలో స్వేచ్ఛగా పర్యటించడం కూడా కష్టంగా మారింది.
ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. చంద్రబాబు
తెలంగాణలో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ స్థితిలో కాంగ్రెసు, తెరాస కుమ్మక్కయి తమ
పార్టీని బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నాయని చంద్రబాబు తీవ్రంగా ధ్వజమెత్తుతూ వచ్చారు. కెసిఆర్‌పై తెలుగుదేశం తెలంగాణ
ప్రాంతానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు
తీవ్రంగా ధ్వజమెత్తారు. తీవ్రపదజాలంతో కెసిఆర్‌ను, తెరాసను దుమ్మెత్తిపోశారు.
అయినా పరకాల ఉప ఎన్నికలో
తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం ఫలితం
సాధించలేకపోయింది. పైగా, వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను తలదన్నుతూ తెరాసను సవాల్ చేసే వాతావరణం
ఏర్పడింది.
వైయస్సార్
కాంగ్రెసు పార్టీ వ్యూహాలు, ఎదుగుదల ఇప్పుడు కెసిఆర్‌ను కలవరపెడుతున్నట్లు చెబుతున్నారు.
తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను అడ్డుకుంటూ ఉంటే వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ దాన్ని వాడుకునే ప్రమాదం ఉందని ఆయన పసిగట్టినట్లు
చెబుతున్నారు. దీంతో ఆయన వైయస్సార్
కాంగ్రెసు పార్టీని లక్ష్యం చేసుకుని తెలంగాణవాదాన్ని నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
తెలంగాణ
వ్యతిరేకి కావడం వల్లనే తాము
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయడం లేదని
తెలుగుదేశం నాయకులు ప్రకటించారు. అందుకు చంద్రబాబు ఆమోదించినట్లు కూడా వారు తెలిపారు.
అదే కారణంతో తెరాస కూడా రాష్ట్రపతి
ఎన్నికలకు దూరంగా ఉంది. దీన్నిబట్టి కూడా
తెలుగుదేశం, తెరాస దగ్గరవుతున్నట్లు అర్థమవుతోందని
అంటున్నారు. కాంగ్రెసు పార్టీని ఎండగట్టాలంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దూకుడును అడ్డుకోవాలంటే తెలుగుదేశం పార్టీతో జత కడితే మంచిదనే
అభిప్రాయానికి తెరాస వర్గాలు వచ్చినట్లు,
అయితే అందుకు తగిన విధంగా చంద్రబాబు
నిర్ణయం ఉంటే అది సులభమవుతుందని
భావిస్తున్నట్లు అంటున్నారు.
ఇటీవలి
కాలంలో తెరాస నాయకులు వైయస్
రాజశేఖర రెడ్డిపై, వైయస్సార్ కాంగ్రెసుపై దాడిని పెంచారు. తెలంగాణ వనరులను, తెలంగాణ భూములను వైయస్సార్ హయాంలో కొల్గగొట్టారని ఆరోపణలు చేస్తున్నారు. వైయస్ జగన్‌పై
గతంలో ఎన్నడూ లేని విధంగా వైయస్
జగన్‌పై తీవ్ర ఆరోపణలు
చేస్తున్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కయ్యాయని కూడా ఆరోపిస్తున్నారు. వైయస్సార్
కాంగ్రెసు పార్టీ కాంగ్రెసుతో కుమ్మక్కు కావడం వల్ల 2009 ఎన్నికల్లో
మాదిరిగా తిరిగి తమను దెబ్బ తీసే
ప్రమాదం ఉందని తెరాస భావిస్తున్నట్లు
సమాచారం. దీంతో తెలుగుదేశంతో జత
కట్టడం వల్ల వైయస్సార్ కాంగ్రెసు
దూకుడును అడ్డుకోవచ్చునని యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
0 comments:
Post a Comment