హైదరాబాద్/కరీంనగర్: కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల
శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ చేనేత
దీక్ష నేపథ్యంలో హైదరాబాద్, కరీంనగర్‌లలో సోమవారం ఉద్రిక్త
పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు వైయస్సార్
కాంగ్రెసు కార్యకర్తలు దీక్షకు సిద్ధం చేయడం, మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు దీక్షను
అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో పరిస్థితి అంతా టెన్షన్ టెన్షన్‌గా మారింది.
పలుచోట్ల
పోలీసులు తెరాస నాయకులను, కార్యకర్తలను
ముందస్తుగా అరెస్టు చేశారు. ఎక్కడికక్కడ పోలీసులచే భారీ బందోబస్తు ఏర్పాటు
చేశారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ వద్ద భారీగా
పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. వీరంగం సృష్టిస్తున్న కార్యకర్తలను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. పలువురు కార్యకర్తలు, విద్యార్థులు పోలీసులపై రాళ్ల దాడి చేశారు.
దీంతో లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.
తెరాస
భవనం సమీపంలోని పోలీసు ఔట్ పోస్టు పైన
రాళ్ల దాడి చేశారు. దీంతో
అద్దాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావును పోలీసులు
అరెస్టు చేసి సంగారెడ్డి తరలించారు.
సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావును అరెస్టు
చేసి కరీంనగర్ తరలించారు. ఈ సందర్భంగా కెటిఆర్
ప్రభుత్వంపై, వైయస్సార్ కాంగ్రెసుపై తీవ్రంగా మండిపడ్డారు.
తమ అరెస్టు దారుణం, అక్రమమని ధ్వజమెత్తారు. సీమాంధ్ర నేతలకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోందని
విమర్శించారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే విజయమ్మ చేనేత దీక్ష చేస్తున్నారన్నారు.
ఆమె దీక్ష చిత్తశుద్ధి లేని
శివ పూజ వంటిదన్నారు. విజయమ్మ
దీక్ష నేపథ్యంలో ఉస్మానియా యూనివర్శిటిలో భారీగా పోలీసులను మోహరించారు. ఈరోజు తెరాస సిరిసిల్ల
బందుకు పిలుపునిచ్చింది.
0 comments:
Post a Comment