హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి తన బెయిల్ పిటిషన్
వెనక్కి తీసుకోవడంపై పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ జగన్ ఇటీవల అత్యున్నత
న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం
తెలిసిందే. అయితే రెండు వారాల్లో
అంటే సోమవారం జగన్ తన బెయిల్
పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.
అందుకు సుప్రీం కోర్టు కూడా అంగీకరించింది.
బెయిల్
పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడానికి
కారణం తనపై ఈడి(ఎన్‌ఫోర్సుమెంటు డైరెక్టరేట్) విచారణ జరుగుతుండటమే కారణమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెబుతోంది. అయితే అందుకు వేర్వేరు
కారణాలు ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈడి విచారణ నేపథ్యంలో
తనకు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చే అవకాశాలు లేకపోవచ్చునని
జగన్ భావించి ఉంటారని అంటున్నారు.
గతంలో
ఆయన సుప్రీంకోర్టులో ఏవైతే కారణాలు చెప్పి
బెయిల్ పిటిషన్ దాఖలు చేశారో దాదాపు
అవే కారణాలతో సిబిఐ ప్రత్యేక కోర్టులో,
హైకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్
దాఖలు చేశారు. ఆయా కోర్టులు ఆయనకు
బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించాయి. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో
బెయిల్ తిరస్కరిస్తే మరో మూడు లేదా
ఆరు నెలల వరకు మరో
కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు అవకాశం
ఉండదు.
ఇప్పటికే
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసుకు మోకరిల్లిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇటీవల అనకాపల్లి పార్లమెంటు
సభ్యుడు సబ్బం హరి ఢిల్లీలో
వారం రోజులు తిష్ట వేశారు. జగన్
కేసు విషయంతో పాటు... రాష్ట్రపతి ఎన్నికలలో ప్రణబ్ ముఖర్జీకి ఓటేస్తామని హామీ ఇచ్చినట్లుగా వార్తలు
వచ్చాయి. అధిష్టానం కూడా కాస్త జగన్‌పై దయతలుచ వచ్చునని
అంటున్నారు.
హామీ
మేరకు ప్రణబ్ ముఖర్జీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటు వేసింది. అంతేకాకుండా
కాంగ్రెసుపై ఆ పార్టీ ఘాటైన
విమర్శలు కూడా ఇటీవల చేయడం
లేదు. దీనిని బట్టి చూస్తుంటే కాంగ్రెసు,
వైయస్సార్ కాంగ్రెసు మధ్య బెయిల్ ఫర్
ఓట్ అనే ఒప్పందం కుదిరి
పోయిందనేది టిడిపి, టిఆర్ఎస్ వాదన. అధిష్టానం తనపై
కరుణ చూపే సమయంలో సుప్రీంకోర్టులో
పిటిషన్ వేసి, బెయిల్ పొందకపోతే
మరి కొన్నాళ్ల పాటు జైలులో ఉండాల్సి
వస్తుందని, విత్ డ్రా చేసుకుంటే
కింది కోర్టుల ద్వారా ఎప్పుడైనా బయటకు రావచ్చుననే ఆలోచనతోనే
జగన్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఈ వ్యాఖ్యలలో
నిజమెంతో అబద్దమెంతో చూడాలి.
0 comments:
Post a Comment