హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ అంశంపై ఏమీ తేల్చక పోవడం
ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేతలను కలవరపరుస్తున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీ పెట్టి ఇన్ని రోజులు కావొస్తున్నా
జగన్ తెలంగాణపై ఏమీ తేల్చలేక పోయారు.
తెలంగాణ విషయంలో ఆయన కూడా తెలుగుదేశం
పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడునే
ఫాలో అవుతున్నారని చెప్పవచ్చు. తెలంగాణ తేల్చవలసింది మేం కాదని, కేంద్రమేనని,
కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా
మాకు అభ్యంతరం లేదని బాబు చెప్పుకుంటూ
వస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో
తెలంగాణపై ఆయనలో మార్పు కూడా
కనిపించినట్లు కనిపిస్తోంది. జగన్ కూడా దాదాపు
ఇదే వైఖరితో ఉన్నారు. తెలంగాణ తేల్చాల్సింది మేం కాదని, కేంద్రమేనని
చెప్పారు. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న కారణంగానే
తాము ఉప ఎన్నికల్లో అభ్యర్థులను
నిలబెట్టలేదని జగన్ పార్టీ చెబుతోంది.
అయితే
తేల్చాల్సింది తాము కాదని, సెంటిమెంట్
ఉన్న కారణంగానే తాము పోటీ పెట్టడం
లేదనే మాటలను తెలంగాణవాదులు నమ్మినట్లుగా కనిపించడం లేదు. అంతేకాదు వారు
తెలంగాణపై ఆయా పార్టీల స్పష్టమైన
వైఖరిని ప్రశ్నిస్తున్నారు. టిడిపి, జగన్ పార్టీ ఏ
పార్టీ అయిన తెలంగాణపై తమ
వైఖరి ఏంటో తెలియజేయాలని డిమాండ్
చేస్తున్నారు. అప్పటి వరకు ఆ పార్టీలను
తెలంగాణ వ్యతిరేకులుగానే భావిస్తామని చెబుతున్నారు. జగన్ మాత్రం తెలంగాణపై
దాదాపు చేతులెత్తేశారనే చెప్పవచ్చు. దీంతో తెలంగాణలోని ఆ
పార్టీ నేతల్లో ఆందోళన నెలకొన్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణపై జగన్ ఏమీ తేల్చక
పోవడం వల్లనే శాసనమండలి సభ్యురాలు పుల్లా పద్మావతి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పారని
అంటున్నారు.
తాను
దివంగత వైయస్ కారణంగా ఎమ్మెల్సీ
పొందానని, అదే గౌరవంతో జగన్
పార్టీలో చేరానని, అయితే రాజకీయ భవిష్యత్తు
దృష్ట్యా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
పథకాల పట్ల ఆకర్షితురాలినై తాను
కాంగ్రెసులో తిరిగి చేరుతున్నట్లు చెప్పారు. అయితే జగన్ తన
వైఖరి తేల్చక పోవడం వల్లనే ఆమె
పార్టీకి గుడ్ బై చెప్పారని
అంటున్నారు. మరోవైపు మాజీ మంత్రి కొండా
సురేఖ కూడా రానున్న ఉప
ఎన్నికల్లో జగన్ పార్టీ తరఫున
పోటీ చేసేందుకు ససేమీరా అంటున్నారట. తెలంగాణపై తేల్చని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే తనకు
నష్టమని భావించి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా
రంగంలోకి దిగేందుకు సిద్ధమౌతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
0 comments:
Post a Comment