సిబిఐ
జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణకు వై కెటగిరీ భద్రత
కల్పించిన విషయం తెలిసిందే. అయితే
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గం
నుంచి ముప్పు ఉండడం వల్లనే ఆయనకు
భద్రత పెంచినట్లు వార్తలు వచ్చాయి. కానీ అది నిజం
కాదట. మాజీ నక్సలైట్ నయీముద్దీన్
నుంచి ముప్పు ఉండడం వల్లనే ఆయనకు
భద్రత పెంచినట్లు వార్తలు వచ్చాయి. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు
విచారణను కూడా లక్ష్మినారాయణకు అప్పగించిన
విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసులో లక్ష్మినారాయణ
ప్రాణాలకు ముప్పు ఉండవచ్చునని హెచ్చరికలు వచ్చాయని అంటున్నారు.
సోహ్రబుద్దీన్
కేసులో నయీముద్దీన్ను పట్టుకోవాల్సిన అవసరం
సిబిఐకి ఉంది. హైదరాబాదులో లక్ష్మినారాయణ
ఆరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. దానివల్ల ఆయనను బదిలీ చేయాల్సి
ఉంటుంది. అయితే, హైదరాబాదులో ఆయన పదవీ కాలాన్ని
మరో రెండు నెలలు పొడగించినట్లు
తెలుస్తోంది. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు
దర్యాప్తు కోసమే ఈ పదవీ
కాలాన్ని పొడగించినట్లు చెబుతున్నారు. ఈలోగా ఆయన నయీముద్దీన్ను పట్టుకోవాల్సి ఉంటుందని
అంటున్నారు.
నయీముద్దీన్
కాంట్రాక్టు కిల్లర్ల ముఠాను నడుపుతున్నట్లు అనుమానిస్తున్నారు. సోహ్రబుద్దీన్ సమాచారాన్ని గుజరాత్ పోలీసులకు అందించింది నయీముద్దీనే అని చెబుతున్నారు. ఈ
కేసులో కొంత మంది ఆంధ్ర
ఐపియస్ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు
ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి సిబిఐ వారిని విచారించింది
కూడా. నయీముద్దీన్తో వారికి సంబంధాలున్నట్లు
కూడా అనుమానిస్తున్నారు.
నిఘా
విభాగంలో ప్రధాన పాత్ర పోషించిన ఐపియస్
అధికారి బాలసుబ్రహ్మణ్యం పాత్రపై సిబిఐ అనుమానాలు వ్యక్తం
చేస్తున్నట్లు ఓ ఆంగ్లదినపత్రికలో వార్తాకథనం
వచ్చింది. ఈ స్థితిలో నయీముద్దీన్
దొరికితే తమకు ప్రమాదమని కొంత
మంది ఐపియస్ అధికారులు అనుకుంటున్నారట. దీంతో అతను పట్టుబడకుండా
ఎత్తులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాము నయీముద్దీన్ను
పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని మాత్రం ఆంధ్ర పోలీసులు అంటున్నారు.
నక్సలైట్ శిక్షణ వల్ల అతన్ని పట్టుకోవడం
కష్టమవుతోందని అంటున్నారు.
0 comments:
Post a Comment