మహబూబ్నగర్లో భారతీయ
జనతా పార్టీ చేతిలో దెబ్బతిన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యుడు
కల్వకుంట్ల చంద్రశేఖర రావు వరంగల్ జిల్లా
పరకాలలో అది పునరావృతం కాకుండా
జాగ్రత్తలు పడుతున్నారట. పాలమూరులో బిజెపి ఖంగు తినిపించడంతో ఆయన
వెంటనే అప్రమత్తమయ్యారు. కమలనాథులు పోటీకి సిద్ధపడుతున్న పరకాలపై ఆయన ముందే కన్నేసి,
తదనుగుణంగా పావులు కదుపుతున్నారట. మహబూబ్నగర్లో బిజెపి
చేతిలో చిత్తయిన అనుభవం పునరావృతం కాకుండా సర్వశక్తులు ఒడ్డేందుకు టిఆర్ఎస్ శ్రేణులను ఆయన సన్నద్ధం చేస్తున్నారు.
2004లో తమ ఖాతాలోనే ఉన్న
ఈ సీటును తిరిగి దక్కించుకోవాలనే పట్టుదలతో కెసిఆర్ ఉన్నారు.
ఇందుకోసం
పరకాలలో పల్లె బాటకు టిఆర్ఎస్
రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలిచి జగన్ వర్గం కాంగ్రెస్
ఎమ్మెల్యేలు శాసనసభ సభ్యత్వాలు కోల్పోయిన దరిమిలా 18 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు తెరలేచిన
విషయం తెలిసిందే. కాగా, వీటిలో తెలంగాణలో
ఎన్నికలు జరగనున్న ఏకైన స్థానం పరకాల.
2004లో ఇక్కడి నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా
శారారాణి గెలుపొందారు. ఆ తరువాత పార్టీపై
తిరుగుబాటు చేసి కాంగ్రెస్లో
చేరిపోయారు. 2009లో కాంగ్రెస్ తరఫున
కొండా సురేఖ గెలుపొందగా, మహా
కూటమి తరఫున టిఆర్ఎస్ అభ్యర్థి
మొలుగూరి భిక్షపతి పోటీ చేశారు. వైయస్
మరణం తర్వాత సురేఖ.. జగన్ వైపు నిలిచారు.
వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ స్వతంత్రంగా
కానీ ఆమె బరిలోకి దిగనున్నారు.
అయితే, ఇటీవలి ఉప ఎన్నికల్లో తెలంగాణలో
మెజారిటీ సీట్లు గెలుచుకున్న టిఆర్ఎస్ అదే తెలంగాణ సెంటిమెంట్
పరకాలలోనూ పండుతుందని భారీ ఆశలే పెట్టుకుంది.
బిజెపిని దెబ్బకు దెబ్బ తీసేందుకు కూడా
ఇక్కడ గెలవడం కీలకమని భావిస్తోంది. స్థానిక రాజకీయ పరిస్థితులు, తెలంగాణ వాదం స్థాయి, అభ్యర్థి
ఎవరైతే బాగుంటుంది, ఏ అభ్యర్థికి ఎంత
మేరకు సానుకూలత ఉందనే అంశాలపై పార్టీ
అధినేత కెసిఆర్ పరకాల నియోజకవర్గంలో మూడుసార్లు
సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక ప్రచారంలో
పాల్గొనటానికి, అంతకంటే ముందే నియోజకవర్గంలో పల్లె
బాట కార్యక్రమం నిర్వహించటం కోసం నాయకుల జాబితాను
ప్రాథమికంగా సిద్ధం చేశారు.
కాగా
పరకాల అభ్యర్థిత్వం విషయంలో కెసిఆర్ కాస్త ఇబ్బంది పడుతున్నట్టే
కనిపిస్తోంది. గత అభ్యర్థి భిక్షపతితో
పాటు పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు పెద్ది
సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపి వినోద్
కుమార్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. జాతీయ స్థాయి రాజకీయాలపై
మక్కువ చూపే వినోద్ కుమార్
పోటీకి ఆసక్తి చూపించటం లేదు. పెద్ది సుదర్శన్రెడ్డి మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అధినేత నిర్ణయానికి
కట్టుబడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే పార్టీకి రెడ్డి
వర్గీయులు దూరమైన క్రమంలో సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇస్తే ఆ వర్గంలో
సానుకూలత పెరుగుతుందన్న వాదన పార్టీలోని ఒక
వర్గం నుంచి వినిపిస్తోందట.
ఇక కాంగ్రెస్ నుంచి ప్రభుత్వ చీఫ్
విప్ గండ్ర భార్య జ్యోతి,
బిజెపి నుంచి ప్రేమేందర్ రెడ్డి,
టిడిపి నుంచి ధర్మా రెడ్డి
పోటీలో ఉంటారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. సుదర్శన్ రెడ్డిని బరిలోకి దించితే, అందరూ రెడ్డి అభ్యర్థులే
అయి బిసి అయిన సురేఖకు
మేలు చేస్తుందని, ఈ దృష్ట్యా భిక్షపతిని
నిలపాలని సీనియర్లు కొందరు సూచిస్తున్నారట.
కొండా
సురేఖ గెలిస్తే జగన్తో టిఆర్ఎస్
కుమ్మక్కు అయిందనే ఆరోపణలను నిజం చేసినట్లవుతుందని, బిజెపి
అభ్యర్థి గెలిస్తే పాలమూరులో కమలనాథులతో కుమ్మక్కయ్యారన్న అపవాదు నిజమవుతుందని భావిస్తున్నారట. ఇక కాంగ్రెస్, టిడిపిలో
ఎవరో ఒకరు గెలిస్తే తెలంగాణ
వాదం లేదంటారని, అందుకే ఇక్కడ గెలుపు తప్పనిసరి
అని తెరాస భావిస్తోందట. ముఖ్యంగా
ఇక్కడ కూడా బిజెపియే గెలిస్తే
రాజకీయంగా తమ పార్టీ తీవ్ర
ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నారట.
0 comments:
Post a Comment