హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై
వరుస పుస్తకాలు ప్రచురించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వైయస్ జగన్ అవినీతి
కార్యకలాపాలను ఎత్తిచూపుతూ ఆంగ్లంలో పుస్తకాలు ప్రచురించి, జాతీయ స్థాయిలో ప్రచారం
చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగులో కూడా వాటిని ప్రచురించి
ప్రజలకు పంచిపెట్టే వ్యూహంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.
వైయస్
రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో రాజా ఆఫ్ కరప్షన్
అనే పేరుతో ఓ పుస్తకాన్ని, ప్రజాస్వామ్యానికి
మైనంగ్ మాఫియా ముప్పు అనే పుస్తకాన్ని తెలుగుదేశం
పార్టీ ప్రచురించింది. వాటిని వివిధ పార్టీల జాతీయ
నాయకులకు, కేంద్ర మంత్రులకే కాకుండా ప్రధానికి కూడా అందజేసింది. అప్పుడు
వైయస్ రాజశేఖర రెడ్డిపై తాము చేసిన ఆరోపణలు,
తాము ఎత్తిచూపిన గాలి జనార్దన్ రెడ్డి
మైనింగ్ కార్యకలాపాలు నిజమని తేలాయని ఆ పార్టీ ఇప్పటికీ
చెప్పుకుంటోంది.
గతంలో
ఆ రెండు పుస్తకాలు ఫలితం
ఇచ్చిన నేపథ్యంలో వైయస్ జగన్కు
వ్యతిరేకంగా పుస్తకాలు ప్రచురించి, జాతీయ స్థాయిలో ప్రచారం
చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి
ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులను కాగ్ తప్పు పట్టిన
నేపథ్యంలో ఆ వివరాలను పొందు
పరుస్తూ పుస్తకాలు రాసి, అచ్చేసి ప్రధానికి,
ఇతర ప్రముఖులకు పంచి పెట్టాలని అనుకుంటున్నారు.
రాష్ట్రంలోని
18 శాసనసభా స్థానాలకు, నెల్లూరు లోకసభ స్థానానికి ఉప
ఎన్నికలు వచ్చేలోగా పుస్తకాలను బయటకు తెచ్చి నియోజకవర్గాల్లో
పంచాలని చంద్రబాబు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలకు అభ్యర్థులను
ఖరారు చేసే పనిలో చంద్రబాబు
నిమగ్నమయ్యారు. వైయస్ జగన్పై
సిబిఐ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో తమ పని సులభం
అవుతుందని భావిస్తున్నారు. అవినీతి ప్రధాన ఎజెండాగా వైయస్ జగన్‌పై
ఎదురుదాడికి దిగాలని తెలుగుదేశం పార్టీ అనుకుంటోంది. పైగా, తమకు ప్రధాన
ప్రత్యర్థి వైయస్ జగన్ తప్ప
కాంగ్రెసు కాదనే భావనలో చంద్రబాబు
ఉన్నట్లు తెలుస్తోంది.
వైయస్
జగన్ను ఎదుర్కోవాల్సిన అవసరం
ఉందని, కాంగ్రెసును పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కాంగ్రెసు
పూర్తిగా బలహీనపడిందని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే, జగన్పై ప్రధానంగా
దృష్టి కేంద్రీకరించాలని అనుకుంటున్నారు. ఉప ఎన్నికలు జరిగే
18 శాసనసభా స్థానాల్లో పరకాల మినహా మిగతా
స్థానాలన్నీ సీమాంధ్రలోనే ఉన్నాయి. అందుకే వైయస్ జగన్ను
టార్గెట్ చేసుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
0 comments:
Post a Comment