హైదరాబాద్:
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
ఇక్కడా అక్కడా తిరుగుతున్నారు కానీ బాధిత రైతులను
పరామర్శించడం లేదని, రైతులు ఆయన చొక్కా పట్టుకుని
నిలదీసే రోజు దగ్గర్లోనే ఉందని
తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివ
ప్రసాద రావు హెచ్చరించారు. పని
లేని వాళ్లను, జులాయిలను ఆదర్శ రైతులగా ప్రభుత్వం
నియమించిందని విమర్శించారు. వడగళ్ళ వానలు, ఈదురు గాలులతో వేలాది
ఎకరాల్లో పంట దెబ్బతిందని, మూలిగే
నక్కపై తాటి పండు పడ్డట్లుగా
రైతుల పరిస్థితి తయారైనా ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
పార్టీ
రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. ఆదర్శ
రైతుల ఎంపికలో వైఫల్యాలు, లొసుగులు, అక్రమాలను పత్రికలు బయటపెట్టినా ప్రభుత్వం ఖాతరు చేయలేదని ఆగ్రహం
వ్యక్తం చేశారు. పైగా ఆదర్శ రైతులుగా
కాంగ్రెస్ కార్యకర్తలనే ఎంపిక చేస్తే తప్పేమిటంటూ
అప్పటి ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా సమర్ధించుకున్నారని ధ్వజమెత్తారు.
గత ఐదేళ్ళుగా ఆదర్శ రైతులు రూ.300
కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. ఆదర్శ రైతులు ఇచ్చిన
చెక్కులపై ఒకే రకమైన సంతకాలు
ఉన్నట్లుగా కాగ్ నివేదికలో స్పష్టం
చేశారన్నారు. రైతులనుంచి నేరుగా ధాన్యాన్ని కొంటామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారని, కానీ
బడ్జెట్లో ఒక్క రూపాయి
కూడా కేటాయించలేదని చెప్పారు. ఈ సిఎం వారానికోమారు
పదవి కాపాడుకునేందుకు ఢిల్లీ వెళ్తున్నారని విమర్శించారు.
టిడిపి
అధికారంలోకి వచ్చాక రైతు సమస్యలకు అధిక
ప్రాధాన్యమిస్తామని, మంత్రివర్గ ఉపసంఘాన్ని వేస్తామని, స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలుపరుస్తామని,
వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతామని తెలిపారు. ఓడిపోతామన్న భయంతోనే స్థానిక ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించడంలేదన్నారు.
0 comments:
Post a Comment