హైదరాబాద్:
సినిమాల్లో నటించాలని ఎఐసిసి పరిశీలకుడు వాయలార్ రవి చేసి సూచనను
మెగాస్టార్ చిరంజీవి అంగీకరించారు. బుధవారం ఉదయం వాయలార్ రవితో
జరిగిన భేటీ వివరాలను ఆయన
బోయన్పల్లి ఎంఎంఆర్ గార్డెన్లో జరిగిన రక్తదాన
కార్యక్రమంలో చిరంజీవి వివరించారు. వయలార్ రవి ఇచ్చిన సలహాలు,
సూచనలను పరిగణలోకి తీసుకుంటానని చెప్పారు. మంచి సబ్జెక్టు దొరికితే
సినిమాలో నటించి తన అభిమానుల కోరిక
కూడా తీరుస్తానని ప్రకటించారు.
ప్రజల్లో
ఉన్న అభిమానం దృష్ట్యా ఒక మంచి సందేశాన్ని
ఇచ్చే సినిమాలో నటించాలని చిరంజీవికి వయలార్ సూచించారు. ఇరువురి మధ్య జరిగిన భేటీలో
ఆయన ఆ సూచన చేశారు.
దాని వల్ల పార్టీకి, ప్రభుత్వానికి
మంచి పేరు రావాలని కోరారు.
రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన సినిమా రంగాన్ని విడిచిపెట్టవద్దని, సమాజానికి సందేశాన్ని ఇచ్చే, కాంగ్రెస్ పటిష్ఠతకు దోహదపడే సినిమాల్లో నటించాలని సూచించారు.
రాజ్యసభ
స్థానాన్ని ఎంపిక చేసుకుని మంచి
పని చేశారంటూ చిరంజీవిని వయలార్ అభినందించారు. భవిష్యత్లో జాతీయస్థాయిలో అనుసరించాల్సిన
విధానాల గురించి వివరించారు. ఇదే సమయంలో ఇటీవల
కోవూరు ఉప ఎన్నికల అంశం
చర్చకు వచ్చినప్పడు .. చిరంజీవి నిర్వహించిన బహిరంగ సభలు, ప్రజాస్పందన కూడా
చర్చకు వచ్చింది. సినీ నటుడిగా చిరంజీవికి
ఉన్న గ్లామర్ను తాము పూర్తిస్థాయిలో
సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని వయలార్ అన్నారు. సినిమాలు ప్రజల్లో చైతన్యం తెస్తాయని వయలార్ చెప్పారు.
వై.ఎస్.జగన్మోహన రెడ్డిపై
రాజకీయంగా ఎదురుదాడి చేయడంలో కాంగ్రెస్లోని రాష్ట్ర నేతలు
విఫలమవుతున్నారని ఏఐసీసీ దూత వయలార్ రవి
అభిప్రాయపడ్డారు. మీడియా వార్తల ప్రకారం - రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పట్ల ఈ భేటీలో
వయలార్ తీవ్ర ఆందోళన వ్యక్తం
చేశారు. ముందుగా.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై చిరంజీవి నుంచి వయలార్ తెలుసుకునే
ప్రయత్నం చేశారు. పార్టీలో కిందిస్థాయి వరకూ సమన్వయ లోపం
ఉందని ఈ సందర్భంగా వయలార్కు చిరంజీవి చెప్పారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి చేజారి పోయే స్థితిలో ఉందని..
గట్టిగా ప్రయత్నిస్తే చక్కదిద్దుకునే వీలుందని వివరించారు. కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య
సఖ్యత లేకుండా పోవడం సరికాదన్న అభిప్రాయాన్ని
చిరంజీవి వ్యక్తం చేశారు. ఈ సమయంలో జగన్
అంశం ప్రస్తావనకు వచ్చింది. అధిష్ఠానం పెద్దల నుంచి కాంగ్రెస్ నేతలందరిపైనా
జగన్ చేస్తున్న విమర్శలకు దీటైన సమాధానం చెప్పలేకపోతున్నామన్న అభిప్రాయం చిరంజీవి, వయలార్ల మధ్య వ్యక్తమైంది.
ఈ సమయంలో వయలార్ జోక్యం చేసుకుంటూ.. తాను గ్రహించినంత వరకూ
జగన్పై రాజకీయంగా ఎదురుదాడి
చేయడంలో పార్టీలోని రాష్ట్ర నేతలు విఫలమయ్యారని అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో.. వైఎస్, జగన్లను వేర్వేరుగా
చూసే విషయం కూడా ప్రస్తావనకు
వచ్చింది. ఈ సమయంలో చిరంజీవి
మాట్లాడుతూ.. వారిద్దరూ ఒక చెట్టుకొమ్మలేనన్నారు. వైఎస్ బతికున్న
రోజుల్లో .. పార్టీ నేతలెవరిపైనైనా అభియోగాలు వచ్చి.. విచారణ జరుగుతున్న సమయంలో చట్టం తన పని
తాను చేస్తుందని వ్యాఖ్యానించేవారని గుర్తు చేశారు. ఇప్పుడు వైఎస్ విషయంలోనూ ఇదే అభిప్రాయాన్ని వెల్లడించే
వీలున్నా.. పార్టీలోని పలువురు నేతలు ఎందుకో మౌనం
దాలుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
0 comments:
Post a Comment