ఒంగోలు:
గతంలో నాతో పెట్టుకున్న వాళ్లెవరూ
బతికి బట్ట కట్టలేదని, దేవుడి
కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారందరూ ఆయన ఆగ్రహానికి గురయ్యారని
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు కెఏ
పాల్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి
బాలినేని శ్రీనివాస్ రెడ్డిని హెచ్చరించారు. బాలినేని తన వైఖరి మార్చుకోకుంటే
ఆయనకు కూడా అదే గతి
పడుతుందని అన్నారు.
సోమవారం
ప్రకాశం జిల్లా ఒంగోలు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను
శపిస్తే ముక్కలు ముక్కలు అవుతావని, నీ గూండాయిజం, రౌడీయిజం
మానుకోవాలని బాలినేనికి సూచించారు. ఒంగోలులో రెండు రోజుల పాటు
జరిగిన శాంతి సభలను అడ్డుకునేందుకు
బాలినేని తీవ్రంగా కృషి చేశారని ఆయన
ఆరోపించారు. ఈ సభలను జరగకుండా
చేసేందుకు ఆయన పలువురిని బెదిరించారని
ధ్వజమెత్తారు.
ఏసుక్రీస్తు
పేరుతో జరుగుతున్న ఈ సభలను ఆడ్డుకోవాలని
చూస్తే ఏం జరుగుతుందో తెలియక
ఆయన ఇలా బెదిరింపు చర్యలకు
పాల్పడుతున్నారన్నారు. ఒంగోలులో సభలకు సహకరిస్తున్న ఐసిఎం
డైరెక్టర్ జెస్సీపాల్ను బాలినేని బెదిరించారన్నారు.
మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు ద్వారా ఆయన
ఈ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. బాలినేని అక్రమంగా కోట్లాది రూపాయలు కూడబెట్టారని, పేదల భూములను అన్యాక్రాంతం
చేశారని ఆయన విమర్శించారు.
గతంలో
దేవుడి కార్యక్రమాలను అడ్డుకుని, పీస్ మిషన్ నిధులను
కాజేయాలని చూసిన వారు ఒక్కరూ
ప్రాణాలతో లేరని ఆయన చెప్పారు.
రాష్ట్రంలోని పద్దెనిమిది నియోజకవర్గాల్లో జరగనున్న ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి
పార్టీ ఐదు నియోజక వర్గాల్లో
అభ్యర్థులను పోటీకి నిలబెడుతుందని పాల్ ఈ సందర్భంగా
చెప్పారు.
ఒంగోలు,
పాయకరావు పేట, పత్తిపాడు, నర్సాపురం,
రామచంద్రపురం నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులు
ఎన్నికల బరిలో ఉంటారని ఆయన
తెలిపారు. ప్రజాశాంతి పార్టీ పోటీ చేసే నియోజకవర్గాల్లో
అభ్యర్థుల పేర్లను త్వరలో ప్రకటిస్తామన్నారు.ప్రజాశాంతి పార్టీ 2014 ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ధీమా
వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment