హైదరాబాద్:
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర
అధ్యక్షుడు, అంబర్పేట శాసనసభ్యుడు
కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిపై బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకసభలో తెలంగాణ ప్రాంత ఎంపీలను సస్పెండ్ చేసే విషయంలో కాంగ్రెసు
పార్టీతో బిజెపి కుమ్మక్కైందన్న వ్యాఖ్యలపై ఆయన తెరాస నేతలపై
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రాంత ఎంపీల వీధి నాటకంలో
మేం భాగస్వామ్యులం కావాలనుకోవడం లేదని చెప్పారు.
వారి
డ్రామాలకు అందుకే బిజెపి మద్దతు ప్రకటించలేదని స్పష్టం చేశారు. కాంగ్రెసుతో కుమ్మక్కు కావాల్సిన అవసరం బిజెపికి ఏనాడు
లేదన్నారు. కాంగ్రెసు కండువా కప్పుకున్నది, యుపిఏ ప్రభుత్వంలో ఉండి
మంత్రి పదవులు తీసుకున్నది తెరాస నేతలేనని గుర్తు
చేశారు. అలాంటి వారికి బిజెపిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం కావాలా వద్దా అనే విషయం
మొదట టిఆర్ఎస్ తేల్చుకోవాలని సూచించారు.
పాలమూరులో
బిజెపి గెలిచిన తర్వాత తెరాసకు తెలంగాణలో ఎదురుగాలి వీస్తోందని చెప్పారు. వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో ఓటమి
భయంతోనే టిఆర్ఎస్ బిజెపిపై విమర్శలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణపై కాంగ్రెసుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. తెలంగాణను విమర్శించడం తెరాసకు సరికాదన్నారు.
తెలంగాణ
కాంగ్రెసు ఎంపీలకు దమ్ముంటే కేంద్రంతో తెలంగాణ బిల్లు పెట్టించాలని ఆయన సవాల్ చేశారు.
అప్పుడు బిజెపి మద్దతు ఇవ్వకుంటే నిలదీయాలని అన్నారు. ఈ నెల 27న
రాజ్యసభలో బిజెపి తెలంగాణపై ప్రయివేటు బిల్లు పెడుతుందని చెప్పారు. అప్పుడు ఎవరు మద్దతిస్తారో ఎవరు
ఇవ్వరో తేలిపోతుందని చెప్పారు.
బిజెపి
బిల్లు పెట్టినప్పుడు చిత్తశుద్ధి ఉంటే టి-కాంగ్రెసు
ఎంపీలు మాతో కలిసి రావాలని
సవాల్ విసిరారు. బిజెపి లేకుండా తెలంగాణ బిల్లు పాసవుతుందా అని ప్రశ్నించారు. సుష్మా
స్వరాజ్ను విమర్శించడమంటే తెలంగాణవాదాన్ని,
తెలంగాణ ఆడపడుచులను కించపరిచినట్లేనని అన్నారు.
తెలంగాణపై
కాంగ్రెసుది రెండు నాల్కల ధోరణి
అన్నారు. ఎంపీలను బహిష్కరించే సమయంలో బిజెపి నోరు విప్పలేదనడం తప్పు
పట్టవద్దన్నారు. తెలంగాణలో బిజెపి హవా కొనసాగుతుందని చెప్పారు.
తెలంగాణపై కాంగ్రెసు బిల్లు పెట్టాలని, అప్పుడు బిజెపి ఓటు వేయకుంటే తెలంగాణ
ప్రజలే మా పార్టీకి బుద్ధి
చెబుతారని చెప్పారు.
0 comments:
Post a Comment