హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసిందనే
ప్రచారం జోరుగా జరుగుతోంది. జగన్ మీడియా జగతి
పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్ ఫ్రాలకు
చెందిన ఆస్తులను ప్రభుత్వ స్వాధీనం చేసుకోనుందని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టివి ఛానల్ ప్రసారం
చేసింది. ఇందుకు సంబంధించిన నోట్ ఫైళ్ల పైన
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,
హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి
ఇప్పటికే సంతకాలు చేసినట్టు తెలిసిందని తెలిపింది.
గురువారం
ఏ సమయంలోనైనా అందుకు సంబంధించిన జివో విడుదలయ్యే అవకాశముందని
అంటున్నారు. జగన్ మీడియా ఆస్తులను
స్వాధీనం చేసుకుంటే దాని భవితవ్యం ప్రశ్నార్థకంగా
మారుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒక ఛానల్, పత్రికల
ఆస్తులను ప్రభుత్వం జప్తు చేయడం ఇదే
ప్రథమం. నేరపూరితమైన పద్దతులలో సంపాదించినప్పుడు వాటిని స్వాధీనం చేసుకోవచ్చునని 1944నాటి క్రిమినల్ లా
అమెండ్మెంట్ ఆర్డినెన్స్ చట్టం
చెబుతోంది.
గతంలో
ఏలేరు స్కాంలో దోషిగా తేలిన పోతినాయుడు ఆస్తులను
ప్రభుత్వం ఆ చట్టం ప్రకారమే
జప్తు చేసింది. వైయస్ జగన్ పైన
కూడా ఇదే ఆయుధాన్ని ప్రభుత్వం
ప్రయోగిస్తోందని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్ పైన ముఖ్యమంత్రి,
హోంమంత్రి బుధవారం రాత్రి సంతకాలు చేశారట. జివో విడుదల కాగానే
ఆస్తులన్నీ ప్రభుత్వం పరం అవుతాయి.
అంతేకాకుండా
వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన మిగిలిన ఆస్తులను కూడా ప్రభుత్వం జప్తు
చేసేందుకు సిద్ధమవుతోందని అంటున్నారు. వాటిని కూడా ఏ క్షణంలోనైనా
జప్తు చేయవచ్చునని తెలుస్తోంది. జగన్ ఆస్తులతో పాటు
నిమ్మగడ్డ ప్రసాద్, సునీల్ రెడ్డిల ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునే
అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం తన విశేష అధికారాలు
ఉపయోగించి జగన్ ఆస్తుల స్వాధీనానికి
చకచకా పావులు కదుపుతోందని అంటున్నారు.
మరోవైపు
జగన్ ఆస్తులు, ఎమ్మార్ కేసులో క్రయవిక్రయాలు నిలిపివేయాలంటూ సర్కారును సిబిఐ కోరినట్లుగా వార్తలు
వస్తున్నాయి. అందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలుస్తోంది.
0 comments:
Post a Comment