హైదరాబాద్:
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో
ప్రధాన నిందితుడు భాను కిరణ్ ఓ
మంత్రి క్వార్టరులో ఉన్నాడంటూ కథనాలు వస్తున్నాయని, ఆయన ఏ మంత్రి
క్వార్టరులో ఉన్నారో బయటకు రావాలని తెలుగుదేశం
పార్టీ అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి మంగళవారం డిమాండ్ చేశారు.
మంత్రులు
బొత్స సత్యనారాయణ, సబితా ఇంద్రా రెడ్డి
సహా ఈ వ్యవహారంలో ఎవరున్నా
బయటకు రావాల్సిందేనన్నారు. వారిని పదవుల నుంచి తప్పించాల్సిందేనని
డిమాండ్ చేశారు. అనేక మంది ప్రముఖుల
రహస్యాలు, డబ్బు లావాదేవీల గురించి
తెలిసినందున భాను కిరణ్ ప్రాణానికి
ప్రమాదం పొంచి ఉందని, అతనికి
రక్షణ కల్పించాలన్నారు.
విజయనగరం
జిల్లాలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ధర్నాకు పోటీగా ధర్నా చేస్తానన్న నేతలు,
మంత్రులను నిలువరించకపోగా బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ మౌనం వహించడం
సిగ్గు చేటని, మీ చేతగానితనానికి నిదర్శనం
అని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై శాసనమండలి ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావు
ధ్వజమెత్తారు.
సిఎంకు,
బొత్స సత్యనారాయణకు మధ్య ఉన్న విభేదాలకు
ప్రశాంతంగా ఉన్న విజయనగరం జిల్లాను
బలి చేస్తారా అని ప్రశ్నించారు. మద్యం
సిండికేట్లకు వ్యతిరేకంగా ఒక
ధర్నా కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేపడితే 3600 మంది పోలీసులు, ఐదుగురు
ఎస్పీలను జిల్లాకు రప్పించి, 144 సెక్షన్ విధించి, ఫైరింగ్, లాఠీచార్జ్కు అనుమతి ఇచ్చి
అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
జోలికి వస్తే తాట తీస్తామని
టిడిపి రాష్ట్ర కార్యదర్శి శోభారాణి కాంగ్రెసు నేతలను హెచ్చరించారు. మద్యం రూపంలో పేదల
రక్తం తాగి కాంగ్రెస్ నేతలు
బలిసి పోయారన్నారు. అధినేత చంద్రబాబు వైపు చూసినా, ఆయన
జోలికి వచ్చినా అంతు తేలుస్తామన్నారు.
బాక్సైట్
గనులను అడ్డగోలుగా రాసిచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని
మహా నేత అంటారా అని
ప్రశ్నించారు. చంద్రబాబే ఆ గనులను ఇచ్చారని
రాస్తారా అని, ఇంత గొడవ
జరుగుతున్నా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి వైయస్
జగన్మోహన్ రెడ్డి నోరు ఎందుకు మెదపరని
ప్రశ్నించారు.
0 comments:
Post a Comment