ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఉప ఎన్నికల వ్యూహాలలో
నిమగ్నమయ్యాయి. ఈ ఉప ఎన్నికలు
కాంగ్రెసుకు ప్రతిష్టాత్మకం, తెలుగుదేశం పార్టీకి అంతే. అయితే వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి
మాత్రం జీవన్మరణ సమస్య! ఉప ఎన్నికలకు షెడ్యూల్
విడుదల కావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది.
ఈ ఉప ఎన్నికలు జగన్
పార్టీ భవితవ్యాన్ని నిర్ణయిస్తాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ ఉప ఎన్నికల్లో
గెలుపొందడం వైయస్సార్ కాంగ్రెసుకు అత్యంత ప్రతిష్టాత్మకం. కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలపై తిరుగుబాటు చేసి జగన్ పక్షం
చేరిన ప్రజా ప్రతినిధులంతా ఎలాగైనా
తమ స్థానాలను నిలుపుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. చిరంజీవి రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన తిరుపతి
అసెంబ్లీ సెగ్మెంట్పైనా జగన్ పార్టీ
కన్నేసింది.
అయితే
సిబిఐ విచారణ, కోర్టు కేసుల కారణంగా జగన్పై జనంలో ఆదరణ
రోజు రోజుకు తగ్గుతోందని ఆ పార్టీ వర్గాలు
ఆందోళన చెందుతున్నాయట. సీమాంధ్రలో జగన్ సభలకు మునుపటిలా
జనం రావడం లేదనే వాదనలు
వినిపిస్తున్నాయి. పార్టీలో ఆయన తప్ప మరో
స్టార్ క్యాంపెయినర్ లేకపోవడం, జగన్ ప్రసంగాలు కూడా
ప్రజలను ఆకట్టుకునే రీతిన ఉండకపోవడం కూడా
లోటుగా ఉందని పార్టీ వర్గాలు
భావిస్తున్నాయని అంటున్నారు.
జగన్
కాలికి బలపం కట్టుకొని తిరిగినప్పటికీ
కోవూరులో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి 2009 ఎన్నికల్లో కంటే అధిక సంఖ్యలో
ఓట్లు రాకపోవడాన్ని ఉదహరిస్తున్నారు. సినీ నటి రోజా
పార్టీలో ఉన్నప్పటికీ, ఆమె ప్రచార ప్రభావం
నామమాత్రమేనని చెబుతున్నాయి. ఇక పార్టీ గౌరవ
అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కడప
జిల్లాలో మినహా ఇతర ప్రాంతాల్లో
ఇంతవరకు పర్యటించలేదు.
ఆమె ఈసారి ప్రచార బాధ్యతలు
చేపట్టేదీ లేనిదీ ఇప్పటివరకు తేలలేదు. తాజా మాజీలే అభ్యర్థులని
పార్టీ వర్గాలు చెబుతుండగా, అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి కాపు రామచంద్రా
రెడ్డి తిరిగి బరిలోకి దిగుతారా? లేదా? అనేది స్పష్టంకాలేదు.
తిరుపతి నుంచి భూమన కరుణాకర్
రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం
జరుగుతోంది. వైయస్ సెంటిమెంట్ ఒక్కటే
తమను గట్టెక్కిస్తుందనే ఆశలో పార్టీ అభ్యర్థులున్నారు.
పరకాలలో
మాత్రం జగన్ పార్టీ విచిత్ర
పరిస్థితిని ఎదుర్కొంటోంది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి లేకపోవడం అక్కడి పార్టీ అభ్యర్థి కొండా సురేఖకు సంకటంగా
మారింది. కాంగ్రెస్ నుంచి ఎన్నికై జగన్
వైపు నిలవడం వల్ల అనర్హత వేటుకు
గురైన ఆమె తెలంగాణ కోసం
పదవి కోల్పోయినట్లు చెబితే స్థానికంగా ఎవరూ నమ్మడం లేదు.
అదే సమయంలో తెలంగాణకు జగన్ పార్టీ అనుకూలమని
చెప్పలేకపోతున్నారు.
సురేఖ
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఎక్కువ
శాతం ఓట్లు, జగన్ పార్టీ అభ్యర్థిగా
బరిలో దిగితే తక్కువ ఓట్లు లభిస్తాయని ఒక
సర్వేలో తేలడం గమనార్హం. వైయస్సార్
కాంగ్రెసు అభ్యర్థిగానే సురేఖ పోటీ చేస్తారని
తాజాగా పార్టీ నేతలు ప్రకటించారు. దీంతో
సురేఖను పరకాలలో ఆదరిస్తారని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.
0 comments:
Post a Comment