హైదరాబాద్:
మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసనసభ్యుడు శంకర రావు గురువారం
ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డిని,
ఆయన తమ్ముడిని టార్గెట్ చేశారు. వస్త్ర వ్యాపారులకు వ్యాట్ తగ్గింపు వెనుక పెద్ద కుంభకోణం
జరిగిందని ఆయన అనుమానాలు వ్యక్తం
చేశారు. వ్యాపారులకు వ్యాట్ మినహాయింపు ఇవ్వవద్దని తాను గతంలోనే మంత్రిగా
ఉన్నప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు. అప్పుడు మినహాయింపు ఇవ్వకుండా ఇప్పుడు మినహాయింపు ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.
వ్యాట్
మినహాయింపుకు ప్రతిగా ముఖ్యమంత్రి సోదరుడి ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆయన ఆరోపించారు. సిఎం
తమ్ముడి ద్వారా రూ.100 కోట్లకు బేరం కుదిరిందని ఆరోపణలు
వస్తున్నాయని అన్నారు. వీటిపై సిబిఐ విచారణ జరిపించాలని
ఆయన డిమాండ్ చేశారు. సిబిఐ విచారణలో వాస్తవాలు
వెల్లడవుతాయన్నారు. తాను మంత్రిగా ఉన్న
సమయంలోనే చిత్తూరు, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు వ్యాపారులు వ్యాట్ తగ్గింపుపై ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారన్నారు.
ప్రభుత్వంపై
ఇలాంటి ఆరోపణలు వస్తే భవిష్యత్తులో కాంగ్రెసుకు
కష్టమని అన్నారు. జూన్ 18వ తారీఖున ప్రజలకు
మంచి జరిగే నిర్ణయం వస్తుందని
ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీకి పలు నియోజకవర్గాలలో అభ్యర్థులు
దొరగడం లేదనే వాదన వినిపిస్తోందని,
తనకు సీమలో టిక్కెట్ ఇప్పిస్తే
గెలిచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
చిత్తూరు
జిల్లాలో ఎర్రచందనం దొంగతనం వెనుక ఎవరి హస్తం
ఉందో అందరికీ తెలుసునన్నారు. కాంగ్రెసులో కొందరు క్లోజింగ్ సెల్స్లో బిజీగా ఉన్నారని
అన్నారు. రాజీవ్ విద్యా మిషన్లో అక్రమాలు
జరిగాయని అనేక ఫిర్యాదులు వస్తున్నాయని
చెప్పారు. వ్యాట్ రద్దుపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో
కామరాజ్ ప్లాన్ అమలు చేయాలని మరో
నేత, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు వేరుగా అన్నారు. కాంగ్రెసులో నమ్మదగ్గ వారికి ప్రాధాన్యం ఉండాలన్నారు. పదవుల కోసమే కొందరు
కాంగ్రెసులో ఉంటున్నారన్నారు. వ్యాపారుల పెత్తనం ఎక్కువైందన్నారు. వారి హవా తగ్గించాల్సి
ఉందన్నారు. పార్టీ కోసం త్యాగం చేయగలిగే
వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. సోనియా చుట్టూ ఉన్న వారితో పాటు
రాష్ట్రంలోని పలువురిని మార్చాల్సి ఉందన్నారు.
ఎలాంటి
ఆరోపణలు లేకుండా క్లీన్ చిట్ ఉన్న వారికి
పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పార్టీని ప్రక్షాళణ చేయాల్సిందేనని ఆయన చెప్పారు. కొందరి
వల్ల ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీపై అనవసర భారం పడుతోందన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థపై విదేశీ సంస్థ రిపోర్ట్ వెనుక
కుట్ర ఉందన్నారు. అహ్లూవాలియా, రంగరాజన్లతో ఆర్థిక వ్యవస్థ
భ్రష్టుపట్టిందన్నారు. వరల్డ్ బ్యాంక్ కళ్లతో మన ఆర్థిక వ్యవస్తను
చూస్తే నష్టం తప్పదన్నారు.
0 comments:
Post a Comment