మధిర:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి తన బాధను ప్రపంచ
బాధగా భావిస్తే ఎలా అని డిప్యూటీ
స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క
శనివారం అభిప్రాయపడ్డారు. మధిర , ఎర్రుపాలెం మండలాల్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి
కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం తన క్యాంపు కార్యాలయంలో
విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన సొంత పత్రిక,
చానల్ ద్వారా నిలువెత్తు ఫొటోలతో ఎన్నికల ప్రచారం చేసుకుంటున్న జగన్ తన ఎన్నికల
ఖర్చులో ఆ పత్రిక, చానల్
ఖర్చులను చూపించాలని డిమాండ్ చేశారు.
అసలు
రాజకీయ పార్టీలున్న వారు పత్రికలు, చానళ్లు
నడపడం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు. ఎన్నికల ఖర్చులో పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలను కూడా ఎన్నికల సంఘం
పేర్కొంటుందని, అలాంటప్పుడు తన సొంత పత్రిక,
చానల్లో జగన్ చేసుకుంటున్న
ప్రచారాన్ని కూడా ఎన్నికల ఖర్చుగా
లెక్కించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ప్రపంచంలో అందరి బాధలు తన
బాధలేనని శ్రీశ్రీ అంటే, తన బాధలు
ప్రపంచం బాధలుగా కృష్ణశాస్త్రి పేర్కొనేవారిని భట్టి తెలిపారు.
అలాగే
జగన్ బాధలను మొత్తం జర్నలిస్టుల బాధలుగా భావించటం సరికాదన్నారు. మధిరలో రెండున్నర దశాబ్దాలుగా ఎక్స్రే సౌకర్యం
లేని ప్రభుత్వాస్పత్రిలో ఆ సౌకర్యాన్ని ప్రారంభించేందుకు
వెళ్తున్న తనను జగన్ పత్రిక
విలేకరులతోపాటు మరికొందరు అడ్డుకోవడం సరైంది కాదని తెలిపారు. యాజమాన్యాల
అవినీతి కార్యకలాపాలకు మద్దతుగా జర్నలిస్టులు ఆందోళన చేయడం సమంజసంగా లేదన్నారు.
సి.రామచంద్రయ్య ఫైర్
కడప:
అక్రమ సంపాదనతో ప్రచార సాధనాలు ఏర్పాటు చేసుకున్న వారికి, లక్షల కోట్లు దోచుకున్న
వారికి నీరాజనాలు పలకాలా అని రాష్ట్ర దేవాదాయ
శాఖ మంత్రి సి.రామచంద్రయ్య మండిపడ్డారు.
పరోక్షంగా జగన్ పత్రికనుద్దేశించి ఆయన
మాట్లాడారు. ప్రాథమిక ఆధారాలతో ఆ పత్రిక అకౌంట్స్ను సిబిఐ ఫ్రీజ్
చేస్తే అది ప్రభుత్వానికి ఏం
సంబంధమని ఆయన అన్నారు. దీనిపై
కొందరు జర్నలిస్టు నాయకులు ఆర్థిక స్వలాభం కోసం వైయస్ బొమ్మ
పెట్టుకొని ర్యాలీ చేయడం జాతికి సిగ్గు
చేటని ఆయన తీవ్ర స్థాయిలో
వ్యాఖ్యానించారు.
కడప జిల్లా లక్కిరెడ్డిపల్లెలో రాయచోటి నియోజకవర్గ ఉప ఎన్నికల సభలో
సీఎం కంటే ముందుగా ఆయన
ప్రసంగించారు. అక్రమ సంపాదనతో ప్రచార
సాధనాలు పెట్టుకొని, పన్నుల రూపంలో ప్రజలు కట్టిన ప్రభుత్వ డబ్బును దోపిడీ చేస్తే అలాంటి వారిని జాతి క్షమిస్తుందా అని
ప్రశ్నించారు. ఇంతటి అభివృద్ధి పనులు
చేస్తోన్న ప్రభుత్వంపై అవాకులు, చవాకులతో వార్తలు రాస్తున్నారని దుయ్యబట్టారు.
రాహుల్
గాంధీకి ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా
ఆయన దాని కోసం పాకులాడలేదని,
కాని రాష్ట్రంలో కొన్ని అరాచక శక్తులు పదవుల
కోసం పాకులాడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఒకవేళ పొరబాటున వీరు
అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఎవ్వరికీ
ప్రశాంతంగా సంసారం కానీ, వ్యాపారం కానీ
చేసుకునే పరిస్థితి ఉండదని పరోక్షంగా జగన్పై తీవ్రస్థాయిలో
విమర్శలు చేశారు.
0 comments:
Post a Comment