న్యూఢిల్లీ:
శుక్రవారం భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో
తెలంగాణపై రాజ్యసభలో ప్రైవేట్ బిల్లును ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంగా పార్టీ
నేత ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ రెండు
రాష్ట్రాలుగా విడిపోతే రెండు ప్రాంతాలు అభివృద్ధి
చెందుతుందన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి
సాధ్యమని చెప్పారు. తెలంగాణకు అన్న రంగాలలో అన్యాయం
జరిగిందన్నారు. తెలంగాణ కోసం సెకండ్ ఎస్సార్సీ
అవసరం లేదని చెప్పారు.
తెలంగాణపై
కాంగ్రెసు పార్టీ తన వైఖరి స్పష్టం
చేయాలని జవదేకర్ డిమాండ్ చేశారు. 1968లో తెలంగాణ కోసం
300 మందికిపైగా ఆత్మ బలిదానాలు చేసుకున్నారని,
రెండువేల సంవత్సరం నుంచి ఇప్పటి వరకు
800 మంది విద్యార్ధులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని జవదేకర్ ఆవేశపూరితంగా పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్ర హోంమంత్రి చిదంబరం చేసిన ప్రకటన నుంచి
ఇప్పటి వరకు ఒక్క అడుగు
కూడా ముందుకు సాగలేదని అన్నారు.
ఆరు సూత్రాల పథకం, 610 జీవో అమలు కావడం
లేదని జవదేకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రణబ్ ముఖర్జీ కమిటీ కాంగ్రెస్ వేసిందేనని,
ప్రభుత్వం వేసిందికాదని ఆయన విమర్శించారు. శ్రీకృష్ణ
కమిటీ చేసిన సూచనలపై ప్రకాశ్
జవదేకర్ మండిపడ్డారు. తెలంగాణ బిల్లును ప్రవేశపెడితే ప్రధాన ప్రతిపక్షం మద్దతిస్తామన్న బిల్లును ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ
కోసం ఎంత మంది ఆత్మత్యాగాలు
చేసుకోవాలని ప్రశ్నించారు.
చరిత్రలో
నిలిచిపోయే విధంగా సకల జనుల సమ్మె
చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని జవదేకర్ డిమాండ్ చేశారు. కాగా బిజెపి ప్రయివేటు
తెలంగాణ బిల్లుపై కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు సుదీర్ఘ వివరణ
ఇచ్చారు.
వెనుకబడిన
ప్రాంతాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోందని కెవిపి ఈ సందర్భంగా చెప్పారు.
ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు
ప్రవేశ పెడుతోందని చెప్పారు. బిజెపి నేత ప్రకాశ్ జవదేకర్
చారిత్రక అంశాలను విస్మరిస్తున్నారని అన్నారు. జవదేకర్ కేవలం రాజకీయ వాగ్ధానాలనే
ప్రస్తావిస్తున్నారని అన్నారు. ప్రత్యేక తెలంగాణను అప్పట్లో బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ
వ్యతిరేకించారన్నారు. బిజెపి 1997లో కాకినాడలో ఒక
వోటు రెండు రాష్ట్రాలు అని
తీర్మానం చేసిందని, కానీ ఆ తర్వాత
అధికారంలోకి వచ్చాక దానిని విస్మరించిందని గుర్తు చేశారు.
ప్రాంతీయ
అసమానతలను అభివృద్ధి ద్వారానే నిర్మూలించామని అద్వానీ ఆనాడు చెప్పారన్నారు. ఈ
సందర్భంగా కెవిపి అద్వానీ రాసిన లేఖను ప్రస్తావించారు.
తెలంగాణ డిమాండ్ తప్పేమీ కాదని, అయితే చారిత్రక అంశాలను
దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. తెలుగు ప్రజలను ఏకం చేయడానికే ఆంధ్ర
ప్రదేశ్ ఏర్పాటు జరిగిందన్నారు. మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రం ఎపి అన్నారు. భాషాప్రయుక్త
రాష్ట్రాల ఏర్పాటులో భాగంగానే ఎపి ఏర్పడిందని చెప్పారు.
రాజకీయ
లబ్ధి కోసమే తెలంగాణ నినాదం
ఎత్తుకుంటున్నారన్నారు. తెలంగాణలోని అనేక ప్రాంతాల కంటే
సీమాంధ్రలోని చాలా ప్రాంతాలు వెనుకబడి
ఉన్నాయని చెప్పారు. తెలంగాణ కంటే ఆంధ్రాలో వృద్ధి
రేటు తక్కువగా ఉందన్నారు. తెలంగాణ పేరుతో కొంతమంది విద్యార్థులను, యువకులను రెచ్చగొడుతున్నారన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించుకొని తప్పుడు సమాచారం ఇచ్చి ఉద్యమకారులు హింసను
ప్రేరేపిస్తున్నారన్నారు.
భౌతికదాడులు, ఆస్తి నష్టాల ద్వారా
అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందన్నారు.
తెలంగాణ
అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ ప్రాంతం పూర్తిగా వెనుకబడి ఉంటే ప్రత్యేక రాష్ట్రం
కోరితే బాగుండేదన్నారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తే బాగుండేదని, కొందరు ప్రాంతీయతత్వాన్ని పెంచి పోషిస్తున్నారన్నారు. శ్రీకృష్ణ కమిటీ
తెలంగాణ అంశంపై సంపూర్ణ నివేదిక ఇచ్చిందని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ అన్ని రాజకీయ
పార్టీలు, సంఘాల అభిప్రాయాలను తీసుకుందని
చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ
నినాదం అన్నారు.
తెలంగాణ
కంటే ఉత్తరాంధ్ర జిల్లాలు వెనుకబడి ఉన్నాయని చెప్పారు. ధాన్యం సేకరణలో ఉభయ గోదావరి జిల్లాలు
వెనుకబడి ఉన్నాయన్నారు. చిన్న రాష్ట్రాలు కోరుతున్న
పార్టీలు ఉత్తర ప్రదేశ్ విభజనను
వ్యతిరేకిస్తున్నాయని బిజెపిని ఉద్దేశించి అన్నారు. నల్లగొండ, కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ స్థాయిలో ధాన్యం సేకరణ ఉండగా గోదావరి
జిల్లాలలో తక్కువగా ఉందని చెప్పారు. బిజెపి
తెలంగాణ ఏర్పాటు కోరుతూ తీర్మానించిన ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని సూచించారు.
0 comments:
Post a Comment