హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన ఇందిరా టెలివిజన్, జగతి పబ్లికేషన్స్ అకౌంట్స్ను సిబిఐ స్తంభింపజేసిన
నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలో ఆయన
ఆస్తులపై కొరడా ఝులిపించనున్నదనే అభిప్రాయాలు
వెలువడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వాధీనాస్త్రాన్ని బయటకు తీయవచ్చుననే
అంటున్నారు. జగన్ ఆస్తులన్నింటినీ స్వాధీనం
చేసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు
తీసుకుంటుందా అనే చర్చ ఇప్పుడు
ప్రధానంగా జరుగుతోంది.
జగన్
ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఉన్న చట్టపరమైన అవకాశాలన్నింటినీ
రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన చట్టాలను న్యాయ నిపుణులకు పంపించి
వారి సలహా కూడా తీసుకుంటోందట.
భారత శిక్షా స్మృతి (ఐపిసి) ప్రకారం శిక్షార్హమైన అక్రమ పద్ధతుల్లో సంపాదించుకున్న,
సమకూర్చుకున్న ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చునని క్రిమినల్ లా అమెండ్మెంట్
ఆర్డినెన్స్, 1944 స్పష్టం చేస్తోంది. ఇది బ్రిటిష్ కాలంలో
చేసిన చట్టం కావడం గమనార్హం.
బ్రిటిష్
కాలంలో ఈ చట్టం వచ్చినప్పటికీ,
స్వతంత్ర భారతంలో ఇది చెల్లుతుందని చెబుతున్నారు.
ఎందుకంటే గతంలో పోతినాయుడు వర్సెస్
కేంద్ర ప్రభుత్వం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ ఆర్డినెన్స్ను
సంపూర్ణంగా సమర్థించింది. ఈ ఆర్డినెన్స్ కింద
పోతినాయుడు ఆస్తుల స్వాధీనాన్నీ సమర్థించింది. ఏలేరు భూకుంభకోణంలో నిందితుడైన
పోతినాయుడు ఆస్తులను 1997లో రాష్ట్ర ప్రభుత్వం
ఈ ఆర్డినెన్స్ ప్రకారమే జప్తు చేసింది.
ఏలేరు
ప్రాజెక్టులో భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారం చెల్లింపులో భారీ కుంభకోణం జరిగింది.
విశాఖపట్నంలో న్యాయవాదిగా ఉన్న పోతినాయుడు ప్రభుత్వ
అధికారులతో లాలూచీ పడి గోల్మాల్కు పాల్పడ్డారని ఆరోపణలు
వచ్చాయి. ఈ కేసులో పోతినాయుడిని
జైలులో పెట్టారు. 1944నాటి ఆర్డినెన్స్ ప్రకారం
ఆయన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసింది. దీనిపై
పోతినాయుడు హైకోర్టును ఆశ్రయించారు. 1950లో భారత రాజ్యాంగం
అమలులోకి వచ్చిందని, 1944నాటి ఆర్డినెన్స్ చెల్లదని
పోతినాయుడు వాదించారు.
ఆస్తుల
జప్తు రాజ్యాంగంలోని 14, 300-ఎ అధికరణకు విరుద్ధమని
ఆయన తెలిపారు. అసలు భారతదేశంలో అమలులో
లేని చట్టం ప్రకారం జప్తు
ఎలా చేస్తారని ప్రశ్నించారు. వాదోపవాదనల అనంతరం పోతినాయుడు వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. క్రిమినల్ లా అమెండ్మెంట్
ఆర్డినెన్స్-1944కు చట్టబద్ధత ఉందని
స్పష్టం చేసింది. క్రిమినల్ లా అమెండ్మెంట్
ఆర్డినెన్స్ 1944 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జగన్ ఆస్తులను కూడా
జప్తు చేసే అవకాశముందని కొన్నాళ్లుగా
ప్రచారం జరుగుతోంది. తాజాగా సిబిఐ అకౌంట్స్ను
సీజ్ చేయడంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం
కూడా ఆస్తుల జప్తుపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశముందని అంటున్నారు.
కాగా
జగన్ ఆస్తుల కేసులో ఈ నెల 28వ
తేదీన తమ ముందు హాజరు
కావాలని కోర్టు వైయస్ జగన్కు
సమన్లు జారీ కాగా, తాజాగా
మంగళవారం సిబిఐ జగన్ మీడియా
సంస్థలకు చెందిన బ్యాంక్ ఖాతాల లావాదేవీలను నిలిపి
వేసిన విషయం తెలిసిందే. సాక్షి
దినపత్రికను ప్రచురించే జగతి పబ్లికేషన్స్, సాక్షి
టెలివిజన్ను నడిపే ఇందిరా
టెలివిజన్, జననీ ఇన్ఫ్రా
బ్యాంకు ఖాతాలను సిబిఐ స్తంభింపజేసింది.
సిఆర్పిసి 102 సెక్షన్ కింద సంక్రమించిన అధికారాలతో
సిబిఐ ఆ ఖాతాలను స్తంభింపజేసింది.
కొత్త ఖాతాలను తెరిచి, కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చునని ఆ సంస్థలకు తెలిపింది.
సాక్షికి సంబంధించి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఒబిసి)
ఖాతాలను, ఇందిరా టెలివిజన్, జననీ ఇన్ఫ్రాకు
చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఖాతాలను సిబిఐ
స్తంభింపజేసింది.
0 comments:
Post a Comment