హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా
శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం
తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వానికి తప్పుడు ఆలోచనే ఉంటే వైయస్ జగన్ను ఎప్పుడో అరెస్టు
చేసి ఉండేదని అన్నారు. తమ పార్టీకి ఎవరి
పైనా వ్యక్తిగత ద్వేషాలు లేవన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు అల్లర్లు సృష్టించి తనపై నింద మోపేందుకు
సిద్ధమవుతున్నాయన్న జగన్, ఆయన పార్టీ
నాయకుల వ్యాఖ్యలను బొత్స ఖండించారు.
జగన్
తన నేర ప్రవృత్తిని దాచిపెట్టుకుంటున్నారన్నారు.
ఆయన అల్లర్లు సృష్టించి ఇతరులపై నిందలు మోపాలని చూస్తున్నారన్నారు. ఆయన అల్లర్లకు పాల్పడితే
కాంగ్రెసు ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. జగన్ వెన్నెముక లేని
నాయకుడన్నారు. విచారణకు బయలుదేరే ముందు జగన్ వాస్తవాలను
వక్రీకరించారన్నారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాల్లో జగన్ ఉన్నారన్నారు. కాంగ్రెసు,
టిడిపి కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదన్నారు.
టిడిపి
అవిశ్వాసం పెడితే ఆయనే మద్దతు ఇచ్చారన్నారు.
ఉప ఎన్నికలు వాయిదా వేసేందుకే జగన్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
కాంగ్రెసు పార్టీకి అలాంటి ఉద్దేశ్యం లేదన్నారు. వాయిదా వేయాలనే ఆలోచన కాంగ్రెసుకు ఉంటే
ఎమ్మెల్యేలపై వేటు వేసేవాళ్లం కాదని
వివరించారు. కాంగ్రెసు పార్టీ చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ అన్నారు. జగన్ దోపిడీ కారణంగా
రాష్ట్రంలో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారన్నారు.
అధికారులతో
సహా పలువురు జైళ్లకు వెళుతున్నారన్నారు. నిన్నటికి నిన్న మంత్రి కూడా
జగన్ కారణంగా జైలుకు వెళ్లారన్నారు. కాంగ్రెసు అధికారం కోసం ఎప్పుడూ అడ్డదారులు
తొక్కలేదన్నారు. జగన్కు అసలు
మనసు లేదన్నారు. అల్లర్లు సృష్టిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. తమకు శాంతిభద్రతలు ముఖ్యమన్నారు.
నీలా కాంగ్రెసు పార్టీ అధికారం కోసం అర్రులు చాచటం
లేదన్నారు. అల్లర్లు సృష్టించి జగన్ పైశాచిక ఆనందం
పొందాలనుకుంటున్నారని మండిపడ్డారు.
జగన్
వైఖరిని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన
విజ్ఞప్తి చేశారు. సాక్షిపైన చర్యలు తీసుకున్నప్పటికీ అందులో పని చేసే ఉద్యోగులకు
ప్రభుత్వం హామీ ఇస్తుందన్నారు. జగన్తో తమ పార్టీ
నేతలు ఎవరు వెళ్లినా చర్యలు
తీసుకుంటామని చెప్పారు. ఎంపీ సబ్బం హరి,
ఎమ్మెల్యే ఆళ్ల నానిపై పార్టీ
పరంగా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయన్నారు. పులివెందుల కృష్ణతో జగన్కు ఉన్న
సంబంధాలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.
0 comments:
Post a Comment