పార్లమెంటులో
కేంద్ర హోం మంత్రి చిదంబరం
చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారం రేపుతోంది.
తెలంగాణ అంశంపై మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
తనను కలిశారని చెప్పారు. నేరుగా ఆ విషయం చెప్పకుండా
తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావును
ఉద్దేంచి - మీ నాయకుడు నన్ను
కలిశారు అని చెప్పారు. దీంతో
చంద్రబాబు నాయుడు మాత్రమే కాకుండా తెలుగుదేశం తెలంగాణ నేతలు ఇరకాటంలో పడ్డారు.
తెలంగాణ ఇవ్వకూడదని అర్థం వచ్చేలా మీ
నాయకుడు నన్ను కలిశారని చిదంబరం
చెప్పారు.
గతంలో
చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినప్పుడు అర్ధ రాత్రి ప్రత్యేకంగా
వెళ్లి హోంమంత్రి చిదంబరంతో సమా వేశమయ్యారని, ప్రత్యేక
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నాన్ని చేశారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నేతలు ఆరోపణలు చేసిన
విషయం తెలిసిందే. అయితే, ఈ విషయాన్ని చంద్రబాబు
ఖండించారు. ఇప్పుడు చిదంబరం చేసిన వ్యాఖ్యలు ఆ
విషయాన్ని ధ్రువీకరించాయని అంటున్నారు. చిదంబరం అబద్ధాలు ఆడుతున్నారని తెలుగుదేశం తెలంగాణ నాయకులు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు.
అదను
చూసి చిదంబరం తెలుగుదేశం పార్టీని వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టారని వ్యాఖ్యానిస్తున్నారు.
పార్లమెంటు సాక్షిగా చిదంబరం అబద్ధం ఆడుతారా అనేది ప్రశ్న. చిదంబరం
మాటల్లో వాస్తవం లేదని తెలుగుదేశం పార్టీ
నాయకులు ఎంతగా చెప్పినా జరగాల్సిన
నష్టం జరుగుతుందనే ఆందోళన తెలుగుదేశం పార్టీలో నెలకొంది. చిదంబరం ప్రకటనను ఆసరాగా తీసుకుని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్,
తెరాస నాయకులు చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు.
అనంతపురం
ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని నగరానికి చేరుకున్న పార్టీ అధినేత చంద్రబాబును గురువారం ఉదయం తెలంగాణ ప్రాంత
నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చిదంబరం చేసిన వ్యాఖ్యలపై ప్రధానంగా
చర్చించారు. తాను చిదంబరాన్ని ఎప్పుడూ
రహస్యంగా కలవలేదని చంద్రబాబు తెలంగాణ ప్రాంత నాయకులకు చెప్పారు. చంద్రబాబు మాటలనే తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు మీడియా ప్రతినిధులతో చెబుతూ వచ్చారు. కానీ ఈ మాటలతో
తెలంగాణ ప్రజలకు విశ్వాసం కల్పించగలుగుతారా అనేది సమస్యనే.
తాను
తెలంగాణకు వ్యతిరేకంగా కాదని, తెలంగాణకు వ్యతిరేకంగా తాను మాట్లాడలేదని చంద్రబాబు
గత కొద్ది కాలంగా ఈ ప్రాంత ప్రజలను
నమ్మించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఈ విషయంలో తాను
కొంత మేరకు ఫలితం సాధించానని
కూడా చెప్పుకున్నారు. కానీ చిదంబరం తాజా
ప్రకటనతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారనే చెప్పాలి. నష్టనివారణ చర్యలు చేపట్టాల్సిన అనివార్యతలో ఆయన పడ్డారు.
0 comments:
Post a Comment