ఉప ఎన్నికల వేళ ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులకు
అసమ్మతి పోటు తప్పేట్లు లేదు.
టికెట్ల కేటాయింపుల్లో తలెత్తిన వివాదం అసమ్మతికి దారి తీస్తోంది. కాంగ్రెసు
పార్టీలో ఇంటిపోరు అధికంగా ఉండగా, తెలుగుదేశం పార్టీలో కాస్తా తక్కువగానే ఉంది. మంత్రి డిఎల్
రవీంద్రా రెడ్డి, మాజీ మంత్రి పి.
శంకరరావు విషయాలను పక్కన పెడితే స్థానికంగా
ఉప ఎన్నికలు జరిగే స్థానాల్లో కాంగ్రెసుకు
అసమ్మతి తలనొప్పిగా మారింది.
తెలుగుదేశం
పార్టీ విషయానికి వస్తే కాపు సామాజిక
వర్గానికి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నిరసన గళం నష్టం
కలిగించేదిగానే ఉంది. తిరుపతి వంటి
కొద్ది నియోజకవర్గాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ అసమ్మతిని ఎదుర్కుంటోంది. చంద్రబాబు నాయుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అసమ్మతి తక్కువగా
ఉంది. వైయస్ జగన్ నాయకత్వంలోని
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో అసమ్మతి లేదనే చెప్పాలి. సిట్టింగులకే
వైయస్ జగన్ టికెట్లు ఇవ్వడంతో
అసమ్మతి సమస్య వైయస్సార్ కాంగ్రెసు
పార్టీలో తెర మీదికి రాలేదు.
టికెట్ల
కేటాయింపు విషయమై కాంగ్రెస్లో ఆ సంతృప్తి
బహిరంగంగా వ్యక్తమవడమే కాకుండా సహాయనిరాకరణ దిశగా నేతలు ముందడుగు
వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా కడప జిల్లాలో మంత్రి
డి.ఎల్.రవీంద్రారెడ్డి అభ్యర్థుల
ఎంపికపై నేరుగా ధ్వజమెత్తారు. తాను ఈ ఎన్నికల్లో
బాధ్యతలు తీసుకోవడంలేదని, పోటీచేసే వారికి ఓటమి తప్పదని బహిరంగంగా
చెప్పారు. రాయచోటి తదితర స్థానాల ఎంపికపై
ఆదే జిల్లాకు చెందిన మరో మంత్రి సి.రామచంద్రయ్యసైతం అసంతృప్తితో ఉన్నారు. రైల్వేకోడూరు అభ్యర్థి ఎంపికపై రాజంపేట పార్లమెంటు సభ్యుడు సాయి ప్రతాప్ అలక
వహించినట్లు వార్తలు వస్తున్నాయి. కాస్తా వెనక్కి తగ్గినట్లు కనిపించినా ఆయన అభ్యర్థుల విజయానికి
ఏ మేరకు సహకరిస్తారనేది అనుమానంగానే
ఉందని అంటున్నారు.
అనంతపురం
జిల్లాలో సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి
సహాయ నిరాకరణ చేస్తున్నట్లు స్పష్టమవుతూనే ఉన్నది. జిల్లాలోని ఎన్నికలకు తనకు సంబంధం లేనట్లుగా
ఆయన వ్యవహరిస్తున్నారని అంటున్నారు. గుంటూరుజిల్లాలో పార్లమెంటు సభ్యుడు రాయసాటి సాంబశివరావు కూడా ఎన్నికల బాధ్యతలు
చేపట్టేందుకు సిద్ధంగా లేరని చెబుతున్నారు. పిలిస్తే
ప్రచారానికి వెళ్లే విషయంపై ఆలోచన చేస్తానని ఆయన
అంటున్నారు.
వరంగల్
జిల్లా పరకాల అభ్యర్థి ఎంపిక
విషయంలోనూ వరంగల్ డిసిసి అధ్యక్షులు, ప్రభుత్వ ఛీప్విప్ గండ్ర
వెంకటరమణారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
మీడియా ముఖంగా ఆయన తన నిరసనను
కూడా వ్యక్తంచేశారు. తన భార్య జ్యోతికి
పరకాల టికెట్ ఇవ్వాలని ఆయన పట్టుబట్టారు. అయితే,
తన అభ్యర్థనను తోసిపుచ్చి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన సమ్మారావుకు
టికెట్ ఇవ్వడంతో ఆయన సహకరించేందుకు సిద్ధంగా
లేనట్లు చెబుతున్నారు.
తనకే
పాయకరావుపేట టిక్కెట్టు కేటాయించాలని విజయరావు ఏకంగా గాంధీభవన్ వద్ద
దీక్షకు దిగారు. వీటితోపాటు మాచర్ల, ఒంగోలు, ఉదయగిరి, రాజంపేట, రాయచోటి, ఆళ్లగడ్డ, రాయదుర్గం అభ్యర్థుల ఎంపికపై ప్రజారాజ్యం పార్టీ నుంచి కాంగ్రెస్లోకి
వచ్చిన నేతలు తీవ్ర అసంతృప్తి
వ్యక్తంచేస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి
ఈ ఎన్నికల్లో పెద్దపీట వేశారని వారు విమర్శిస్తున్నారు. పోలవరం, మాచర్ల
అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా
అసంతృప్తి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం
పార్టీలో అనంతపురం, మాచర్ల, రాజంపేట టిక్కెట్ల విషయంలో పోటీ తీవ్రంగానే కనిపించింది.
అనంతపురం, మాచర్ల నియోజకవర్గాలకు బాలకృష్ణ తన వారికి టిక్కెట్లు
ఇప్పించుకోగలిగారని అంటున్నారు. అయితే ఈ అభ్యర్థుల
ఎంపిక విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
తమ పార్టీ నేతలను ఒప్పించి, మెప్పించి వారిని ఎంపిక చేయడం వల్ల
నష్టం తగ్గిందని అంటున్నారు. మొత్తంగా కాంగ్రెసు పార్టీయే ఉప ఎన్నికల్లో ఇంటిపోరును
ఎక్కువగా ఎదుర్కుంటోంది. పైగా, ఉప ఎన్నికలు
కాంగ్రెసు పార్టీకి అగ్నిపరీక్షలాంటివి.
0 comments:
Post a Comment