హైదరాబాద్:
కాంగ్రెసు రాజకీయాల్లోనే కాకుండా కడప జిల్లాలోనూ మంత్రి
డిఎల్ రవీంద్రా రెడ్డి కార్నర్ అవుతున్నారు. గతంలో ఆయన వెంట
నడిచిన వీరశివా రెడ్డి, వరదరాజులు రెడ్డి వంటివారు కూడా ఆయనను తీవ్రంగా
వ్యతిరేకిస్తున్నారు. పైగా ఆయనపై అధిష్ఠానానికి
ఫిర్యాదు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై
ఆయన ప్రత్యక్ష యుద్ధానికి దిగడంతో దాదాపుగా ఒంటరిగా అయ్యారు.
కడప లోక్సభ ఉప
ఎన్నికల నుంచి డీఎల్ వెంట
నడిచిన వారంతా క్రమంగా ముఖ్యమంత్రి పక్షానికి మారుతున్నారు. ఇలాంటి సమయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సిన డీఎల్ సంయమనాన్ని వీడి
శత్రుపక్షం ముగ్గులో పడ్డారని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కొద్ది రోజులుగా సీఎల్పీ వేదికగా జరుగుతున్న కార్యకలాపాలు, డీఎల్ చేసిన వ్యాఖ్యలు
కాంగ్రెస్ నేతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తనపై
డీఎల్ వ్యాఖ్యల పట్ల సీఎం తీవ్ర
ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. మంత్రివర్గ సహచరుడే తనపై తీవ్రస్థాయిలో విమర్శిస్తే
ఇక క్రమశిక్షణకు తావెక్కడిదని అధిష్ఠానాన్ని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
గతంలో
ఇదే విధంగా బాహాటంగా విమర్శలకు దిగిన శంకర్రావుకు
మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికినట్లే
డీఎల్కూ ట్రీట్మెంట్
ఇవ్వాలని అధిష్ఠానాన్ని ముఖ్యమంత్రి కోరుతున్నారు. డీఎల్ వ్యాఖ్యలను అధిష్ఠానం
దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోంది. శనివారం ఢిల్లీకి వెళ్తున్న సీఎం పనిలో పనిగా
డీఎల్ వ్యవహారంపైనా తాడో పేడో తేల్చుకోనున్నట్లు
పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. కాగా పీసీసీ అధ్యక్షుడు
బొత్స సత్యనారాయణ తో ఆయన నివాసంలో
డీఎల్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన
వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఇకపై
తాను మీడియాతో మాట్లాడబోనని సత్తిబాబుకు డీఎల్ హామీ ఇచ్చారు.
కడప జిల్లా నేతలతోనూ, మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డితోనూ
మాట్లాడిన సత్తిబాబు ఇకపై డీఎల్కు
వ్యతిరేకంగా మాట్లాడొద్దని సూచించారు. ఇందుకు వారు సమ్మతించారు. కాగా
ఢిల్లీ వెళ్లి డీఎల్పై అధిష్ఠానానికి
ఫిర్యాదు చేయాలని కడపకు చెందిన వీరశివారెడ్డి,
వరదరాజులు రెడ్డి నిర్ణయించారు. ఢిల్లీకి సీఎం సూట్కేసులు
మోసుకువెళ్లాడన్న డీఎల్ వ్యాఖ్యలే అతన్ని
బయటకు పంపుతాయని వీర శివారెడ్డి అంటున్నారు.
ప్రస్తుతం ఒంటరిగా మారిన డీఎల్ భవిష్యత్తు
వ్యూహం ఎలా ఉంటుందన్న దానిపై
పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది.
0 comments:
Post a Comment