హైదరాబాద్:
పార్టీలో వ్యతిరేక గళాలకు చెక్ చెప్పే దిశలో
కాంగ్రెసు పార్టీ వెళుతోంది. మాజీ మంత్రి జీవన్
రెడ్డికి పిసిసి క్రమశిక్షణా సంఘం గురువారం షోకాజ్
నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి కితాబు నేపథ్యంలో జీవన్ రెడ్డికి నోటీసులు
జారీ చేశారు. ఈ సందర్భంగా క్రమశిక్షణా
సంఘం అధ్యక్షుడు కంతేటి సత్యనారాయణ మాట్లాడారు.
ఈ నెల 24వ తేదిలోగా
గాంధీ భవనంకు వచ్చి షోకాజ్ నోటీసులకు
సమాధానం చెప్పాలని సూచించామని అన్నారు. జీవన్ రెడ్డిపై రాతపూర్వక
ఫిర్యాదులు అందాయి కాబట్టే షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. పార్టీ
నేతలు ఎవరూ కూడా క్రమశిక్షణ
ఉల్లంఘించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రిపై కొందరు విమర్శలు చేస్తున్నారని, దానిపై నివేదికు పార్టీ అధిష్టానానికి అందజేస్తామని చెప్పారు.
మాకు
మేముగా ఎవరికీ నోటీసులు ఇవ్వమని చెప్పారు. ఫిర్యాదులు అందితేనే స్పందిస్తామని చెప్పారు. మిగతా వారి పైన
ఫిర్యాదులు వస్తే పరిశీలిస్తామని అన్నారు.
క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పైన లేనిపోని ఆరోపణలు
చేసిన శివాజీ వివరణతో తాము సంతృప్తి చెందినట్లు
చెప్పారు. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి,
మాజీ మంత్రి శంకర రావుల తీరుపై
పిసిసి, ఏఐసిసిలకు, కేంద్ర క్రమశిక్షణ కమిటీకి నివేదిక ఇస్తామని చెప్పారు.
కాగా
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
పైన జీవన్ రెడ్డి చేసిన
విమర్శలు, 2014లో వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని, తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి ఆయన ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేస్తారని జీవన్ రెడ్డి చేసిన
వ్యాఖ్యలకు సంబంధించిన పత్రికా క్లిప్పింగులతో పాటు పార్టీ నేత
మృత్యుంజయం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
0 comments:
Post a Comment