నెల్లూరు:
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించిన
కృష్ణా జిల్లా నూజివీడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్య శనివారం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో
సమావేశమయ్యారు. నెల్లూరు జిల్లా ఉప ఎన్నికల ప్రచారంలో
ఉన్న చంద్రబాబును ఆయన ఇక్కడికి వచ్చి
కలిశారు. చంద్రబాబుతో భేటీ తర్వాత ఆయన
యూ టర్న్ తీసుకున్నారు. తెలుగుదేశం
పార్టీకి రాజీనామా చేసి ఆయన వైయస్
జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి.
మీడియా
వార్తలను చిన్నం రామకోటయ్య చంద్రబాబుతో భేటీ తర్వాత ఖండించారు.
తనకు పార్టీ పట్ల ఏ విధమైన
అసంతృప్తి లేదని ఆయన చెప్పారు.
తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు దుష్ప్రచారం చేశారని ఆయన విమర్శించారు. తాను
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని మాత్రమే
చెప్పానని, పార్టీ నుంచి తప్పుకుంటానని చెప్పలేదని
ఆయన అన్నారు. తాను తెలుగుదేశం పార్టీలోనే
కొనసాగుతానని ఆయన చెప్పారు.
ఉప ఎన్నికలపై మాట్లాడడానికి మాత్రమే తాను చంద్రబాబును కలిసినట్లు
ఆయన తెలిపారు. తాను వచ్చే ఎన్నికల్లో
పోటీ చేయబోనని ఆయన ప్రకటించిన తర్వాత
తెలుగుదేశం పార్టీలో కలవరం ప్రారంభమైంది. ఆయనతో
తెలుగుదేశం పార్టీ నాయకులు మంతనాలు జరిపారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, శానససభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు, మరికొంత మంది
నాయకులు చిన్నం రామకోటయ్యతో మాట్లాడారు.
కృష్ణా
జిల్లా నాయకులు మాట్లాడిన తర్వాత చిన్నం రామకోటయ్య దిగి వచ్చి చంద్రబాబును
కలిశారని అంటున్నారు. తాను తెలుగుదేశం పార్టీలోనే
కొనసాగుతానని చిన్నం రామకోటయ్య చంద్రబాబుతో చెప్పారు. తన భవిష్యత్తుపై కార్యకర్తలతో
మాట్లాడిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని ఇటీవల ఆయన చెప్పారు.
పార్టీ మారాలనుకుంటే కార్యకర్తలతో చర్చించిన అనంతరమే నిర్ణయిస్తానని చెప్పారు.
కృష్ణా
జిల్లా జగన్ పార్టీ నాయకుడు
సామినేని ఉదయభానుతో పాటు రాష్ట్ర స్థాయి
నేతలతో చిన్నం రామకోటయ్య చర్చలు జరిపినట్లుగా వార్తలు వచ్చాయి. జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసే పరిస్థితులు
లేవని, జిల్లా నేతలు తనను ఏ
కార్యక్రమానికి పిలవడం లేదని, చంద్రబాబు కూడా వారి మాటలనే
పరిగణలోకి తీసుకుంటున్నారని ఆయన ఆవేదనతో ఉన్నారని
ప్రచారం జరిగింది. అందుకే ఆయన పార్టీని వీడాలనుకుంటున్నారని
అంటున్నారు.
0 comments:
Post a Comment