నెల్లూరు:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి చెడు అలవాట్లు ఉన్న
వ్యక్తి అని తెలుగుదేశం పార్టీ
అధినేత నారా చంద్రబాబు నాయుడు
అన్నారు. ఆయన శుక్రవారం శ్రీ
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారంలో
పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడారు. 2004లో కాంగ్రెసు అధికారంలోకి
రాకముందు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి..
తాను అప్పుల పాలయ్యానని, తన ఇల్లు అమ్ముకునేందుకు
అనుమతి ఇవ్వాలని తనకు లేఖ రాశారని
అన్నారు.
అయితే
అది ప్రభుత్వం భూమి కావడంతో తాను
అందుకు అనుమతి ఇవ్వలేదని, అవసరమైతే డబ్బు చెల్లించి తీసుకోమని
చెప్పానని అన్నారు. 2004లో అప్పులు తీర్చుకోవడానికి
ఇల్లు అమ్ముకుంటానని చెప్పిన వైయస్ కుటుంబం ఇంత
తక్కువ సమయంలో కోట్లాది రూపాయలు ఎలా సంపాదించారని ఆయన
ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక కోట్లు సంపాదించిన దుర్మార్గుడు వైయస్ అన్నారు. జగన్
చెడు ప్రవర్తనకు అలవాటుపడ్డ వ్యక్తి అన్నారు.
భాను
కిరణ్, మంగలి కృష్ణ వంటి
సంఘ విద్రోహ శక్తులతో జగన్కు సాన్నిహిత్యం
ఉందని ఆరోపించారు. ప్రముఖ సినీ దర్శకుడు రామ్
గోపాల్ వర్మ తనను జగన్
బెదిరించారని చెబుతున్నారని, కానీ అతను బెదిరించనిది
ఎవరినన్నారు. బెదిరింపులతో, ప్రలోభాలతో అందరినీ జైళ్లకు పంపించారన్నారు. వారిని సర్వనాశనం చేశారన్నారు. జగన్ తప్పు చేసిన
నాడే వైయస్ విజయమ్మ అడిగి
ఉంటే ఈ పరిస్థితి వచ్చేది
కాదన్నారు.
అందరూ
పిల్లల్ని వారిలాగే పెంచుతున్నారా అన్నారు. ఎవరైనా తమ పిల్లలు తప్పు
చేస్తే వద్దని చెప్తారు కానీ విజయమ్మ మాత్రం
అడ్డుకోలేదన్నారు. జగన్ అరెస్టయ్యాక ఆమె
రాజకీయ నాయకురాలిగా ఓట్లు పొందేందుకు సానుభూతి
రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఓటేసినంత మాత్రాన వారు చేసిన అవినీతి
మాయమవుతుందా అన్నారు. అవినీతికి పాల్పడిన కొడుకు కోసం విజయమ్మ రోడ్డెక్కడం
విడ్డూరంగా ఉందన్నారు.
పరిటాల
రవిని చంపేందుకు 2001లో మంగలి కృష్ణ
బాంబు పెట్టారని, దాని వెనుక జగన్
ఉన్నారని ఆరోపించారు. ఆ తర్వాత 2005లో
పరిటాలను దారుణంగా హత్య చేశారని మండిపడ్డారు.
జగన్ పార్టీకి ఓటు వేస్తే మన
ఇంటికి మనమే పన్ను కట్టాల్సిన
పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు.
దోపిడి విధానంతోనే విద్యుత్ ఛార్జీల పెంపు, ధరల పెంపు జరుగుతోందన్నారు.
తన దగ్గర బాగా పని
చేసిన అధికారులు, ఒకప్పుడు మంచి వ్యాపారాలు చేసుకున్న
వారు ఇప్పుడు జైళ్లలో మగ్గుతున్నారన్నారు. అవినీతికి మద్దతు ఇచ్చే రాజకీయ నేతలు,
పార్టీలు, వ్యక్తులు అందరూ దుర్మార్గులే అన్నారు.
జగన్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు
పాల్పడ్డారని మండిపడ్డారు. కాంగ్రెసు అసమర్థ, పనికిమాలిన పార్టీ అన్నారు. జగన్ పార్టీ అవినీతి,
హత్యల పార్టీ అన్నారు.
0 comments:
Post a Comment