హైదరాబాద్:
ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ నేతలు అప్పుడప్పుడు తడబాటుకు
గురవుతున్నారు. ప్రచారంలో మాట్లాడే సమయంలో మాటల తడబాటు పక్కన
పెడితే ఏకంగా అభ్యర్థుల విషయంలోనే
వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కూడా తన ప్రచారంలో
గురువారం కాస్త ఇబ్బంది పడ్డారు.
ఆయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ధర్మాన రాందాస్ తరఫున ఉప ఎన్నికల
ప్రచారం నిర్వహించారు.
ఈ సమయంలో ఆయన మాట్లాడుతూ.. ధర్మాన
కృష్ణదాసుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను
కోరారు. లగడపాటి వ్యాఖ్యలతో పక్కనున్న కాంగ్రెసు పార్టీ నాయకులు, ఓటర్లు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.
అంతలోనే తడుముకున్న లగడపాటి... కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ధర్మాన రాందాసును గెలిపించాలని కోరారు. అంతకుముందు మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కూడా ఇదే విధంగా
ఇబ్బంది పడ్డారు.
శత్రుచర్ల
నరసన్నపేట బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆయన
కూడా ధర్మాన కృష్ణదాసును గెలిపించాలని సభాముఖంగా కోరారు. అయితే అంతలోనే తమాయించుకున్న
అతను రాందాసును గెలిపించాలని కోరారు. నరసన్నపేటలో ప్రధానంగా అభ్యర్థుల పేరు ప్రస్తావించడానికి కాంగ్రెసు
పార్టీ నేతలు కొంచెం ఇబ్బంది
పడుతున్నారనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తున్న
ధర్మాన కృష్ణదాసు నిన్నటి వరకు కాంగ్రెసు పార్టీ
ఎమ్మెల్యే.
జగన్
సొంతకుంపటి పెట్టాక ఆయన కాంగ్రెసు పార్టీకి
గుడ్ బై చెప్పారు. అతను
మంత్రి ధర్మాన ప్రసాద రావుకు స్వయానా సోదరుడు. అంతేకాదు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున ధర్మాన కృష్ణదాసు
పోటీ చేస్తుండగా, కాంగ్రెసు తరఫున ధర్మాన రాందాస్
రంగంలోకి దిగారు. ఇద్దరూ అన్నదమ్ములే. నిన్నటి వరకు కాంగ్రెసులో ఉండటం,
పేర్లు దాదాపు ఒకేలా ఉండటం, అన్నదమ్ములు
కావడం తదితరాల కారణంగా కాంగ్రెసు నేతలకు వెంటనే ధర్మాన రాందాసు పేరు స్ఫురిస్తున్నట్లుగా లేదు.
మరోవైపు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
కూడా ఉప ఎన్నికల ప్రచారంలో
అప్పుడప్పుడు ఆచితూచి మాట్లాడుతున్నారు. ఇటీవల ఒక్కొక్కరు పది
ఓట్లు వేయాలని తిరుపతి ప్రచారంలో అన్నారు. దీనిపై స్పందించిన ఈసి కిరణ్కు
నోటీసులు పంపించింది. దానికి సిఎం వివరణ ఇచ్చారు.
ఆ తర్వాత శుక్రవారం పాయకరావుపేటలో జరిగిన ప్రచారంలో ఇవే వ్యాఖ్యలు చేసినప్పుడు
కాస్త ఇబ్బందికి గురయ్యారు. ఒక్కొక్కరికి పది వేళ్లు ఉన్నాయని
చెప్పి కాసేపు ఆగి ఆలోచించి ఆ
తర్వాత ఒక్కొక్కరు పదిమందిని ఒప్పించి ఓటు వేయించాలని సూచించారు.
0 comments:
Post a Comment