హైదరాబాద్:
2014లో జరిగే సాధారణ ఎన్నికలకు
పార్టీ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
అప్పుడే సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.. బీసీలకు వంద సీట్లు కేటాయిస్తామని,
ఏడాది ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని చంద్రబాబు చెప్పారు. ఆ మేరకు ఏడాదిన్నర
ముందుగానే అభ్యర్థులను సిద్ధం చేస్తున్నారు. బీసీ అభ్యర్థులతో పాటు
ఇతర అభ్యర్ధుల్నీ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇన్‌చార్జ్‌లు లేని నియోజక
వర్గాల్లో ఇన్‌చార్జ్‌లను
నియమిస్తూ, ‘వచ్చే ఎన్నికల్లో మీకే
టికెట్, మీ నియోజకవర్గాలపై ఇప్పటి
నుంచే దృష్టి సారించండి' అని చంద్రబాబు నేతలకు
ఆదేశిస్తున్నారు.
గతంలో
నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు
టికెట్ లభిస్తుందనే గ్యారంటీ ఉండేది కాదు. ఏళ్ల తరబడి
నియోజకవర్గంలో పార్టీ వ్యయాన్ని భరించి తిప్పలు పడే వారు ఒకరైతే,
తీరా ఎన్నికలు సమీపించినప్పుడు టికెట్ వేరే వారికి లభించేది.
ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నాయకుల్లో నమ్మకం లేకుండా పోయింది. ఈ ఎత్తుగడ ప్రారంభంలో
పార్టీకి ఉపయోగపడిందని భావించినా, చివరకు టికెట్‌పై ఎలాంటి గ్యారంటీ
లేకపోవడం నాయకుల్లో ఉత్సాహం సన్నగిల్లింది. ఎవరికి వారు ప్రచారంలో హడావుడి
చూపడం తప్ప నియోజకవర్గంలో పార్టీ
కార్యక్రమాల నిర్వాహణకయ్యే వ్యయాన్ని భరించడానికి పెద్దగా ఆసక్తి చూపడం తగ్గింది. ఇప్పుడు
పలువురు ఇన్‌చార్జ్‌లకు
వచ్చే ఎన్నికల్లో మీరే అభ్యర్థులు అని
చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
సమీక్షా
సమావేశాల్లోనూ, నాయకులతో విడిగా చర్చించే సమయంలోనూ ఇన్‌చార్జ్‌లే
వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులని చంద్రబాబు వెల్లడించారు. అంతేకాకుండా ఇన్‌చార్జ్‌లు
లేని నియోజక వర్గాల్లో ఇన్‌చార్జ్‌లను
నియమిస్తూ, వచ్చే ఎన్నికల్లో మీకే
టికెట్ అని హామీ ఇచ్చారు.
కృష్ణా జిల్లా పామర్రు ఇన్‌చార్జ్‌గా
వర్ల రామయ్యను నియమించారు. అదేవిధంగా నల్లగొండ జిల్లా నకిరేకల్ ఇన్‌చార్జ్‌గా
పాల్వాయి రజనీకుమారిని నియమించారు. 2004 ఎన్నికల సమయంలో సూర్యాపేట మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న ఆమెను
చివరి నిమిషంలో సూర్యాపేట అభ్యర్థిగా ప్రకటించగా, ఆమె ఓడిపోయారు. ఇప్పుడు
నకిరేకల్ ఇన్‌చార్జ్‌గా
నియమించారు.
2007లో
వరంగల్ బీసీ డిక్లరేషన్‌లోనే
బీసీలకు వంద సీట్లు కేటాయించనున్నట్టు
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. అయితే 2009 ఎన్నికల్లో ఆ మాట నిలబెట్టుకోలేదు.
దాంతో ఇప్పుడు ముందుగానే బీసీ అభ్యర్థులకు వంద
సీట్లు కేటాయించడం ద్వారా బీసీల్లో విశ్వాసం కలిగించడంతోపాటు ఓటు బ్యాంకు ఏర్పాటు
చేసుకోవడానికి అవకాశం ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటి
వరకు 74మంది బీసీ అభ్యర్థుల
ఎంపిక పూర్తయిందని తెలుగుదేశం నాయకుడు కెఇ కృష్ణమూర్తి ప్రకటించారు.
ఏడాదిముందే వంద సీట్లు అని
ప్రకటించిన మాట నిలబెట్టుకొని, వందకన్నా
కొన్ని సీట్లు అధికంగా ఇవ్వడంతోపాటు ఏడాది కన్నా ముందే
అభ్యర్థులను ప్రకటించడం ద్వారా బీసీల విశ్వాసాన్ని చూరగొంటాం
అని పార్టీ నేతలు చెబుతున్నారు.
0 comments:
Post a Comment