హైదరాబాద్:
రాష్ట్రంలోని బిసీ ఓటర్లను ఆకట్టుకోవడానికి
బీసీ డిక్లరేషన్ ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
ఇక ఎస్సీలపై దృష్టి పెట్టారు. ఎస్సీ ఓటర్లను ఆకట్టుకోవడానికి
ఆయన పథకం రూపొందించే పనిలో
పడినట్లు తెలుస్తోంది. ఇందుకుగాను, ఆయన ఆగస్టు 1,2 తేదీల్లో
ఎస్సీ నాయకులతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణపై ఆయన
మరోసారి స్పష్టత ఇచ్చే అవకాశాలున్నాయి. ఎస్సీ
రిజర్వేషన్ల వర్గీకరణకు తెలుగుదేశం పార్టీ ఇంతకు ముందు అంగీకరించింది.
తాజా
పరిణామాల నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై
చంద్రబాబు మరోసారి స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని ఎస్సీలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట
నడుస్తున్నట్లు ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలు
తేల్చాయని అంటున్నారు. ముఖ్యంగా, క్రిస్టియన్ ఎస్సీలు ఆయనకు పూర్తి మద్దతు
ఇస్తున్నట్లు తేలింది. వీరిలో ఎక్కువ మంది సీమాంధ్రకు చెందిన
మాలలు ఉన్నారని అంచనాలు వెలువడ్డాయి.
ఎస్సీ
రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతు ఇవ్వడం వల్ల మాలలు దూరమయ్యారా
అనే కోణాన్ని కూడా చంద్రబాబు పరిశీలించనున్నట్లు
తెలుస్తోంది. దాంతో మాలలకు, మాదిగలకు
అంగీకారయోగ్యమైన ఫార్ములాను రూపొందించే పనిలో ఆయన పడినట్లు
చెబుతున్నారు. ఈ ఫార్ములా ఎలా
ఉంటుందనేది మాత్రం తెలియడం లేదు.
బీసీ
డిక్లరేషన్ ద్వారా బిసీల్లో నమ్మకం కలిగించడానికి చేసిన ప్రయత్నం ఫలిస్తుందని,
అలాగే ఎస్సీలకు నమ్మకం కలిగించే ఓ స్కీమ్‌ను
తయారు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చంద్రబాబు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఎస్టీలకు
సంబంధించిన మేధో మథన సదస్సు
నిర్వహించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణపై
కూడా చంద్రబాబు స్పష్టత ఇస్తారని అంటున్నారు. అన్ని అంశాలపై, అన్ని
సామాజిక వర్గాలపై ఒక స్పష్టతతో ముందుకు
పోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు.
0 comments:
Post a Comment