న్యూఢిల్లీ:
కొడుకు చేసిన తప్పులను కప్పి
పుచ్చుకునేందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్
విజయమ్మ ఢిల్లీకి వచ్చారని అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్ గురువారం
మండిపడ్డారు. ఆయన ఢిల్లీలోని తన
నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఏమేం వ్యాపారాలు చేసి
ఆస్తులు సంపాదించారో చెప్పి తన నిజాయితీని నిరూపించుకోవాల్సింది
పోయి, కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేస్తున్న
సిబిఐ జెడి లక్ష్మీ నారాయణను
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి వేధిస్తున్నారని ఆరోపించారు.
తన మీడియాను ఉపయోగించుకుని నిజాయితీగా పనిచేస్తున్న ఒక అధికారి ఆత్మస్థైర్యాన్ని
దెబ్బతీసేందుకు జగన్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారని
అన్నారు. తప్పు చేస్తే కాంగ్రెస్
ఎంతటి వారినైనా క్షమించదని ఆయన ప్రకటించారు. దివంగత
వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే ఇప్పుడు
ఆయన కూడా విచారణ ఎదుర్కోవాల్సి
వచ్చేదని అభిప్రాయపడ్డారు. 1999వ సంవత్సరంలో వైయస్
జగన్ ఆస్తి ఎంతో చెప్పాలని..
రూ.300 కోట్ల ముందస్తు పన్ను
చెల్లించే స్థాయికి జగన్ ఎలా ఎదిగారో,
ఏమేం వ్యాపారాలు చేశారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
సిబిఐ
కూడా ఇదే విషయాన్ని అడుగుతోందని..
అందుకే సాక్షి మీడియా ఇష్టమొచ్చినట్లు కథనాలు రాస్తూ, సిబిఐ విశ్వసనీయతను ప్రశ్నిస్తోందన్నారు.
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిసినంత
మాత్రాన తప్పు ఒప్పైపోదని ఆయన
వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగాల్సిన అవసరం ఉందని.. అయితే
పార్టీకి, ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగ పడే రీతిలో
మార్పు జరిగితేనే ప్రయోజనం ఉంటుందని హర్షకుమార్ ప్రకటించారు.
దివంగత
వైయస్ మరణంపై అనుమానాలు కేవలం రాజకీయ లబ్ధి
కోసమే తప్ప వాస్తవం కాదన్న
విషయం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్
విజయమ్మ నిరూపించారని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర
వెంకట రమణా రెడ్డి హైదరాబాదులో
అన్నారు. ఉప ఎన్నికల సమయంలో
ప్రతిరోజూ వైయస్ మరణంపై అనుమానాలు
వ్యక్తం చేసిన విజయమ్మ తన
ఢిల్లీ పర్యటనలో ఈ అంశంపై దర్యాప్తు
జరపాలని ప్రధాని మన్మోహన్‌తో సహా పలువురు
నేతలను కోరుతారని భావించామని అన్నారు. కాని ఆ ప్రస్తావనే
ఆమె చేయలేదని అన్నారు. అంటే.. ఈ అనుమానాలన్నీ ఎన్నికల్లో
రాజకీయలబ్ధి పొందేందుకేనని అర్థం అవుతోందని అన్నారు.
0 comments:
Post a Comment