న్యూఢిల్లీ:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల
శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మకు సోమవారం
సుప్రీం కోర్టులో చుక్కెదురయింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
ఆస్తులపై విచారణ జరపాలన్న విజయమ్మ పిటిషన్‌ను సుప్రీం కోర్టు
తోసి పుచ్చింది. విజయమ్మ తరఫున సుప్రీం కోర్టులో
రాంజెత్మలానీ, ముకుల్ రోహిత్గీ, రిలయన్స్ తరఫున హరీష్ హల్వే,
ఎకే గంగూలీ, రామోజీ రావు తరఫున అనిల్
దివాన్‌లు వాదించారు.
ఉదయం
పదిన్నర గంటలకు సుప్రీం కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు సహా 22 మందిపై విచారణకు ఆదేశించాలని విజయమ్మ తరఫు న్యాయవాది జెత్మలానీ,
ముకుల్ సుప్రీంను కోరారు. ఆస్తులపై ప్రాథమిక విచారణకు ఆదేశించినంత మాత్రాన ఎలాంటి అరెస్టులు జరగవని, నష్టమూ ఉండదని, తమ పిటిషన్‌ను
రాజకీయ కోణంలో చూడవద్దని విజయమ్మ తరఫు న్యాయవాదులు వాదించారు.
పిటిషనర్
ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేకనే హైకోర్టు పిటిషన్
కొట్టి వేసిందని, విచారణకు ఆదేశిస్తే వేల కోట్ల తమ
వ్యాపారానికి ఇబ్బందులు ఎదురవుతాయని రిలయన్స్ తరఫు న్యాయవాది వాదించారు.
తమ వాదనలు వినకుండా ప్రాథమిక విచారణలు ఎలా ఆదేశిస్తారని రామోజీ
రావు తరఫు న్యాయవాది వాదించారు.
ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశ్యంతో కూడుకున్న పిటిషన్ అని చెప్పారు.
ఇరువైపుల
వాదనలు విన్న సుప్రీం కోర్టు
విజయమ్మ పిటిషన్‌ను కొట్టి వేసింది.
ఈ సందర్భంగా విజయమ్మకు సూచనలు చేసింది. చంద్రబాబు అండ్ కో అవినీతితో
ఆస్తులు సంపాదించినట్లు ఆధారాలు ఉంటే ఎసిబిని సంప్రదించాలని
సూచించింది. ఎసిబిలో న్యాయం జరక్కపోతే అప్పుడు సుప్రీంను ఆశ్రయించవచ్చునని తెలిపింది. కాగా సుప్రీం తీర్పుపై
తెలుగుదేశం పార్టీ నేతలు హర్షం వ్యక్తం
చేశారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందన్నారు.
0 comments:
Post a Comment