హైదరాబాద్:
పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన నలుగురు శాసనసభ్యులపై తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. నూజివీడు
శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్య, మంత్రాలయం శాసనసభ్యుడు బాలనాగి రెడ్డి, పరిగి శాసనసభ్యుడు హరీశ్వర్
రెడ్డి, ముథోల్ శాసనసభ్యుడు సముద్రాల వేణుగోపాలాచారిలను సస్పెండ్ చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకూడదని పార్టీ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా వారు ఓటు వేశారు.
గుడివాడ
శాసనసభ్యుడు కొడాలి నాని కూడా రాష్ట్రపతి
ఎన్నికల్లో ఓటు వేశారు. అయితే,
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను, అధ్యక్షుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసినందుకు ఆయనను ఇది వరకే
తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత నాని,
తెలుగుదేశం పార్టీ నాయకులకు మధ్య మాటల యుద్ధం
నడిచింది.
ఓటు వేసిన ఐదుగురు శాసనసభ్యుల్లో
చిన్నం రామకోటయ్య, కొడాలి నాని, బాల నాగిరెడ్డి
ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది.
హరీశ్వర్ రెడ్డి, సముద్రాల వేణుగోపాలాచారి మాత్రం తెలంగాణ నగారా సమితి శాసనసభ్యుడు
నాగం జనార్దన్ రెడ్డితో కలిసి పిఎ సంగ్మాకు
ఓటేశారు. చిన్నం రామకోటయ్య గత కొద్ది కాలంగా
తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన తొలుత జగన్
నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి ప్రయత్నించారు. అయితే, అక్కడ తన షరతులకు
ఆమోదం లభించకపోవడంతో కాంగ్రెసు పార్టీకి దగ్గరయ్యారు. ఆయన ఓటు వేయడానికి
కూడా కాంగ్రెసు శాసనసభ్యులతో కలిసి వచ్చారు.
కొడాలి
నాని నియోజకవర్గం గుడివాడకు, చిన్నం రామకోటయ్య నియోజకవర్గం నూజివీడుకు తెలుగుదేశం పార్టీ ఇంచార్జీలను కూడా నియమించింది. బాలనాగిరెడ్డి
మాత్రం చాలా కాలంగా వైయస్
జగన్ వెంట నడుస్తున్నారు. ఆయనపై
చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది.
అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయడం సాంకేతికంగా పార్టీ ధిక్కరణ కిందికి రాదు. పార్టీ నిర్ణయాన్ని
రాష్ట్రపతి ఎన్నికల్లో పాటించాల్సిన అవసరం లేదు. విప్
జారీ చేసినా అది శానససభ్యులకు వర్తించదు.
0 comments:
Post a Comment