కరీంనగర్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల
శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ దీక్షకు
మరో రోజు మాత్రమే మిగిలి
ఉండటంతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణవాదులు ఆందోళనకు దిగుతున్నారు. విజయమ్మ వెంటనే తమ దీక్షను రద్దు
చేసుకోవాలని లేదంటే జగన్‌ను గతంలో
మహబూబాబాద్‌లో అడ్డుకున్నట్టే అడ్డుకుంటామని
హెచ్చరిస్తున్నారు. తెలంగాణపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తే తామే హైదరాబాదు నుండి
సాదరంగా ఆహ్వానించి తీసుకు వస్తామని సూచిస్తున్నారు.
విజయమ్మను
అడ్డుకునేందుకు టిఆర్ఎస్ సిద్ధమవుతోంది. పార్టీ అనుబంధ సంఘాలు, తెలంగాణ జెఏసి, తెలంగాణ విద్యార్థి జెఏసి సహా తెలంగాణవాదులందరినీ
ఏకం చేసి వైయస్సార్ కాంగ్రెసు
వ్యూహాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా విజయమ్మ దీక్షకు ఒక రోజు ముందు
సిరిసిల్లలో బహిరంగ సభ, ధూంధాంలను నిర్వహిస్తున్నారు.
23న విజయమ్మ దీక్షను విఫలం చేసేందుకు అదే
రోజున సిరిసిల్ల బంద్‌కు కూడా
టిఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సిరిసిల్ల
ప్రాంతం రసవత్తర రాజకీయానికి వేదికగా మారింది.
బహిరంగ
సభలో ప్రజలు భారీసంఖ్యలో పాల్గొని బంద్‌ని విజయవంతం
చేయాలని టిఆర్ఎస్ నేతలు ఈటెల రాజేందర్,
కెటి రామారావు పిలుపునిచ్చారు. తెలంగాణలో మళ్లీ అలజడి రేపొద్దని,
అశాంతిని సృష్టించవద్దని విజయమ్మకి హితవు పలికారు. మరోపక్క
తెలంగాణ జెఏసి కూడా దీక్షను
వ్యతిరేకిస్తోంది. సీమాంధ్ర ఆధిపత్యం కొనసాగించడానికే వైయస్సార్ కాంగ్రెసు దీక్ష చేపట్టిందని తెలంగాణ
విద్యావంతుల వేదిక పేర్కొంది.
మరోవైపు
సిరిసిల్లలో పట్టు కోసం వైయస్సార్
కాంగ్రెసు, టిఆర్ఎస్ వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి.
కెసిఆర్‌కు గతంలో అత్యంత
సన్నిహితుడిగా ఉన్న కెకె మహేందర్
రెడ్డి 2009 ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో కెసిఆర్ కుమారుడు కెటిఆర్‌పై రెబల్‌గా
పోటీ చేసి స్వల్ప తేడాతో
ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి, అనంతరం వైయస్సార్
కాంగ్రెస్‌లో చేరిన మహేందర్
రెడ్డి నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు పావులు
కదుపుతున్నారు. ఇటు కెటిఆర్ కూడా
స్థానికేతరుడు అనే ముద్రను తొలగించుకునేందుకు
నియోజకవర్గానికి అందుబాటులో ఉంటూ పలు కార్యక్రమాల్లో
పాల్గొంటున్నారు.
0 comments:
Post a Comment