హైదరాబాద్: జాతిపిత మహాత్మా గాంధీతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని పోల్చుతూ వెలిసిన ఫ్లెక్సీపై ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఇప్పటి వరకు క్షమాపణ చెప్పక పోవడం బాధాకరమని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు గురువారం అన్నారు. మహాత్ముడితో జగన్‌ను పోల్చుతూ వెలిసిన ఫ్లెక్సీపై విహెచ్ సికింద్రాబాదులో నిరసన వ్యక్తం చేశారు.
ఎంజి రోడ్డులోని మహాత్మా గాంధీకి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీతో ప్రపంచంలో ఎవరికీ పోలిక లేదన్నారు. అలాంటి జాతిపిత పక్కన జగన్ ఫోటో పెట్టడమా ఛీ అంటూ విహెచ్ మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తారని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. మహాత్ముడి పక్కన జగన్ ఫోటో పెట్టిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతపై ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోక పోవడం సిగ్గుచేటు అన్నారు.
ఇప్పటికైనా అతనిపై చర్యలు తీసుకోవాలని అతను డిమాండ్ చేశారు. సంఘటన జరిగి 24 గంటలు గడిచినా ప్రభుత్వం స్పందించక పోవడమేమిటని ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెసు నేతలకు పిచ్చి ముదిరిందని, అందుకే ఇలా చేశారన్నారు. ఈ ఘటనపై విజయమ్మ లేదా ఆ పార్టీ నాయకులు ఈ రోజైనా స్పందించి దానిని ఖండిస్తారని భావించానని, కానీ వారు కూడా ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. ఖండన ప్రకటన ఆ పార్టీ నుండి రాకపోవడం బాగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా గుంటూరుకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత శ్రీనివాస రావు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో జగన్‌ను, మహాత్ముడిని పక్క పక్కన ఉంచి వారిద్దరినీ జైలులో ఉన్నట్లు ఆ ఫ్లెక్సీలో చిత్రీకరించారు. తెల్లదొరల కాలంలో మహాత్ముడు జైలుకు వెళ్లారని, నల్ల దొరల కాలంలో జగనన్న జైలుకు వెళ్లారని ఆ ఫ్లెక్సీలో రాశారు. అంతేకాదు ఓ మహాత్మా ఇది న్యాయమా అంటూ చివరలో రెండు వ్యాఖ్యలు కూడా రాశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది.
0 comments:
Post a Comment