ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మొట్టికాయలు పడినట్లు
తెలుస్తోంది. సమన్వయ లోపంపై ఆమె నిక్కచ్చిగానే కిరణ్
కుమార్ రెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. సమన్వయ లోపమే గత ఉప
ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణమని భావించినట్లు చెబుతున్నారు. గత ఢిల్లీ పర్యటనలో
కిరణ్ కుమార్ రెడ్డికి సోనియా గాంధీ అపాయింట్మెంటు
కూడా ఇవ్వలేదు. కానీ సోమవారం ఆయన
ఆమెను కలుసుకోగలిగారు. అంతర్గత భద్రతపై ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి
సోనియాను కలిశారు.
వచ్చే
18 స్థానాల ఉప ఎన్నికల్లో మెజారిటీ
స్థానాలను గెలుచుకుని తీరాలని ఆమె ఆదేశించినట్లు చెబుతున్నారు.
గత ఉప ఎన్నికల ఫలితాలు
పునరావృతం కాకూడదని ఆమె చెప్పినట్లు సమాచారం.
విభేదాలు లేకుండా సమన్వయంతో ముందుకు సాగాలని ఆమె సూచించినట్లు చెబుతున్నారు.
ఉప ఎన్నికల కోసం అనుసరిస్తున్న వ్యూహాలను
ఆయన సోనియాకు వివరించినట్లు సమాచారం. గత ఎన్నికల ఫలితాలపై
ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం
చేసినట్లు చెబుతున్నారు.
తెలంగాణ
ఉప ఎన్నికల విషయంలో సెంటిమెంటు సాకు చూపకూడదని, సీమాంధ్రలో
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను
ఓడించడం అవసరమని ఆమె కిరణ్ కుమార్
రెడ్డికి నూరి పోసినట్లు చెబుతున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి పాత పాటనే పాడినట్లు
తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలను పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం లేదని ఆయన చెప్పినట్లు
తెలుస్తోంది. ఏ చర్యలు తీసుకున్నా
కూడా పార్టీ బలంగా ఉందనే సంకేతాలను
తీసుకుని వెళ్లాలని, విభేదాలతో పార్టీ బలహీనపడిందనే అభిప్రాయాన్ని కలిగించకూడదని ఆమె ముఖ్యమంత్రికి చెప్పినట్లు
సమాచారం.
కాగా,
ఎట్టి పరిస్థితిలో మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేశామో గుర్తుంచుకోవాలని, తాము ఉంచిన విశ్వాసాన్ని
నిలబెట్టుకోవాలని సోనియా కిరణ్ కుమార్ రెడ్డితో
అన్నట్లు తెలుస్తోంది. క్రమంగా వైయస్ రాజశేఖర రెడ్డి
ముద్రను తొలగించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని కిరణ్ కుమార్ రెడ్డి
సోనియాతో చెప్పినట్లు తెలుస్తోంది. ఏమైనా, పార్టీ వచ్చే ఉప ఎన్నికల్లో
మెజారిటీ స్థానాలు గెలుచుకునేలా చూడాలని ఆమె చెప్పినట్లు సమాచారం.
గత ఉప ఎన్నికల్లో ఓటమికి
ముఖ్యమంత్రి సమన్వయంతో పార్టీ నాయకులందరినీ కలుపుకుని వెళ్లకపోవడమేనని సోనియా బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది.
అందుకు అనుగుణంగానే ఆమె కిరణ్ కుమార్
రెడ్డికి సూచనలు ఇచ్చినట్లు చెబుతున్నారు.
0 comments:
Post a Comment