హైదరాబాద్:
రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశముందని వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆదివారం
జోస్యం చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని
విమర్శించే అర్హత, నైతిక విలువ ప్రభుత్వ
చీఫ్ విప్ గండ్ర వెంకట
రమణ రెడ్డికి గాని, కమలాపురం శాసనసభ్యుడు
వీర శివా రెడ్డికి కానీ
లేదని మండిపడ్డారు.
వైయస్
రాజశేఖర రెడ్డిని కాంగ్రెసు పార్టీ విలన్గా చూపించే
కుట్రలు పన్నుతోందన్నారు. వారి వ్యూహం తప్పకుండా
బెడిసి కొడుతుందని చెప్పారు. తెలుగుదేశం, కాంగ్రెసు రెండు ఉమ్మడి ఎజెండాతో
ముందుకు వెళుతున్నాయని ఆరోపించారు. తమ పార్టీని, పార్టీ
అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో మంతనాలు చేస్తున్నారని అంబటి ఆరోపించారు.
సిబిఐ
ఛార్జీషీటులో నిందితుడిగా వైయస్ పేరును చేర్చిన
రోజే కాంగ్రెసు వైఖరి తేటతెల్లమైందన్నారు. వైయస్ను
అడ్డు పెట్టుకొని జగన్ పైన కక్ష
సాధించేందుకు కాంగ్రెసు ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. వైయస్ రెక్కల కష్టంతో
వచ్చిన ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తూ ఆయన పైనే విమర్శలు
చేయడం దారుణమన్నారు. వైయస్సార్ను అవినీతిపరుడిగా చిత్రీకరించే
సమయంలో కాంగ్రెసు రాక్షసత్వం బయటపడిందన్నారు.
ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, టిడిపి రెండు తలల రాక్షసి
కుప్పకూలుతుందన్నారు. ఉప ఎన్నికల తర్వాత
ఏ క్షణంలోనైనా మధ్యంతరం రావచ్చునన్నారు. జగన్ను బయటకు
పంపిన రోజే కాంగ్రెసు పడవకు
చిల్లు పడిందన్నారు. మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న పడవలో చిరంజీవి
ఎక్కారని ఎద్దేవా చేశారు. వైయస్కు తామే
వారసులమని చెబుతున్న కాంగ్రెసు పెద్దలు ఉప ఎన్నికల్లో వైయస్ను టార్గెట్ చేయడంపై
ఏం సమాధానం చెబుతారన్నారు.
0 comments:
Post a Comment