మాజీ
మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత తలసాని శ్రీనివాస్
యాదవ్ పార్టీలో ఉంటారా లేక ఆ పార్టీని
వీడుతారా అనే చర్చ రాజకీయ
వర్గాల్లో జోరుగా జరుగుతోంది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై
ఆయన గత కొద్ది రోజులుగా
అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల రాజ్యసభ సీటును
పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్కు ఇవ్వడంపై శ్రీనివాస
యాదవ్ కినుక వహించారు. దీంతో
ఆయన అప్పుడే పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం
చేశారు. దీంతో ఆయన ఇప్పుడు
టిడిపిలో ఉంటారా ఉండరా అనే చర్చ
జరుగుతోంది. గతంలోనూ ఒకసారి ఆయన పార్టీ వీడుతారు
అనే ప్రచారం జరిగింది. తాజాగా మరోసారి ఈ ప్రచారానికి తెరలేచింది.
పార్టీ
నేతల వద్ద ఆయన చేస్తున్న
వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత
ఊతమిస్తున్నాయి. టిడిపి నుంచి తలసాని నిష్క్రమించిన
పక్షంలో జగన్ పార్టీకి సన్నిహితంగా
మారవచ్చన్న ప్రచారం జరుగుతోంది. తలసాని సోమవారం ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో విలేకరుల సమావేశం
నిర్వహించి జగన్ కేసులో సిబిఐ
దాఖలు చేసిన చార్జిషీటుపై మాట్లాడారు.
ఈ చార్జిషీటులో మంత్రులను, కెవిపి రామచంద్ర రావుని చేర్చకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. దీనిపై
సమాధానం ఇవ్వకపోతే వారం తర్వాత కోర్టులో
కేసు దాఖలు చేస్తానని హెచ్చరించారు.
సాధారణంగా
తెలుగుదేశం పార్టీలో నాయకులు కేసులపై వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోరు. పార్టీ నిర్ణయం తీసుకొన్న తర్వాత దానికి అనుగుణంగా నాయకులు కేసులు వేస్తారు. కానీ, ఛార్జిషీట్ విషయంలో
కేసు వేయడంపై తలసాని తనకు తానుగానే నిర్ణయం
ప్రకటించారని అంటున్నారు. ఇప్పటికే సమాచారం కూడా సేకరించి పెట్టుకొన్నానని
ఆయన చెప్పారు. పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్ర వైఖరితో ఆయన వెళ్తున్నారన్న ప్రచారం
దీనితో బలపడుతోంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక నాటి నుంచి
తలసాని తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు.
తెలంగాణ
నుంచి టిడిపి తరఫున రాజ్యసభ అభ్యర్థిగా
దేవేందర్ గౌడ్ను ఎంపిక
చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
కానీ, దేవేందర్ పేరునే చంద్రబాబు ఖరారు చేయడంతో పార్టీ
వ్యవహారాలకు తలసాని ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు వ్యవహార శైలిపై పార్టీ నేతల వద్ద తీవ్ర
అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో, వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి జగన్మోహన్
రెడ్డి పట్ల తలసాని కొంత
సానుకూలంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. జగన్పై ఉన్న
అవినీతి ఆరోపణలను సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తలసాని ప్రస్తావించలేదు.
జగన్ను ఇప్పటికే కేసులో
చేర్చినందువల్ల ఆయన గురించి తాను
కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదని విలేకరులతో
తలసాని అన్నారు. తాను టిడిపిని వీడనని
చెబుతూనే తన రాజకీయ భవిష్యత్తు
ఏమిటో చెప్పాల్సిన సమయంలో చెబుతానని అన్నారు. తన భవిష్యత్ రాజకీయ
వ్యూహంపై మాత్రం ఆయన ఆచితూచి మాట్లాడుతున్నారు.
0 comments:
Post a Comment