యానాం/కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్ అనుచరులు తదితరుల నుండి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కోరుతూ పుదుచ్చేరి శాసనసభ స్పీకర్ కోదండరాంకు యానాం నియోజకవర్గ శాసనసభ్యుడు మల్లాడి కృష్ణా రావు వినతి పత్రాన్ని అందజేశారు. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మల్లాడి తన వాదనను వినిపించారు. అంతు చూస్తానంటూ తన కదలికలను ఎప్పటికప్పుడు పలువురు తెలుసుకుంటున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం పుదుచ్చేరి విలేకరులతో మాట్లాడారు. తనకు యానాం, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లకు చెందిన పలువురు వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందని పేర్కొంటూ 19 పేర్లతో కూడిన జాబితాను విడుదల చేశారు.వీటిలో ముఖ్యంగా అమలాపురంకు చెందిన కాంగ్రెసు ఎంపి హర్ష కుమార్ పేరును పేర్కొన్నారు.
పుదుచ్చేరికి చెందిన ఏఐడిడిఎంకె ఎమ్మెల్యే, ఓ వ్యాపారి, మరో జర్నలిస్టుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. పుదుచ్చేరిలో ఇద్దరు అంగరక్షకులను, యానాంలో నలుగురు అంగరక్షకులను కల్పించాలని స్పీకర్ ను కోరినట్లు మల్లాడి చెప్పారు. కాగా కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో రీజెన్సీ సంఘటనలపై సిబిఐ విచారణకు పుదుచ్చేరి ప్రభుత్వం సిఫార్సు చేస్తుందని ముఖ్యమంత్రి రంగస్వామి అసెంబ్లీ ఫ్లోర్ లో వెల్లడించినట్టు మల్లాడి చెప్పారు.
కాగా కొంతకాలం క్రితం యానాంలోని రీజెన్సీ ఫ్యాక్టరీలో ఉద్రిక్తత ఏర్పడిన విషయం తెలిసిందే. రీజెన్సీ కార్యాలయంలో కార్మికులు నిప్పు పెట్టడం, ఓ కార్మికుడు మృతి చెందటం, ఆ తర్వాత రీజెన్సీకి చెందిన ఓ అధికారి కూడా చనిపోవడం ఆ తర్వాత రీజెన్సీని మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే.
0 comments:
Post a Comment