హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్
రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకే రూ.28.86 కోట్ల
మేర భూబదలాయింపు, అభివృద్ధి ఛార్జీలను మినహాయిస్తూ జివోలు ఇచ్చామని పురపాలక శాఖ
మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్ ఎమ్మార్ కేసులో సిబిఐ ఎదుట
వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన చట్టబద్ధమైన ఛార్జీలను మినహాయించే అధికారం ప్రభుత్వానికి లేదని
ఆయన చెప్పారు. నిబంధనలకు వ్యతిరేకమని, సైబరాబాద్ అభివృద్ధి సంస్థ భారీగా నష్టపోతుందని తాను అభ్యంతరం చెప్పానని వాంగ్మూలం ఇచ్చారు.
ముఖ్యమంత్రి పరిశ్రమల శాఖ ముఖ్య
కార్యదర్శి శ్యాంబాబును నివేదిక కోరారని, ఆయన ఎపిఐఐసి ఎండిని నివేదిక కోరారని చెప్పారు. అప్పటి ఎపిఐఐసి ఎండి బిపి ఆచార్య ఎమ్మార్కు ఛార్జీల మినహాయింపు కోసం గట్టిగా సిఫార్సు చేశారని చెప్పారు. ఆ మేరకు శ్యాంబాబు దస్త్రాన్ని ముఖ్యమంత్రికి పంపించారని తెలిపారు. వైయస్సార్ ఎమ్మార్కు అన్ని ఛార్జీలను మినహాయించారని చెప్పారు. ఎమ్మార్లో తాను కొనుగోలు చేసిన విల్లాకు గజానికి రూ.5వేల చొప్పున చెల్లించానని చెప్పారు. అదనంగా తాను ఎలాంటి చెల్లింపులు జరపలేదని చెప్పారు.
ఎపిఐఐసికి సేకరించిన భూములు, సేకరణ
నుంచి జరిగిన ఉద్దేశ్య పూర్వక మినహాయింపులపై రంగారెడ్డి, మెదక్ జిల్లాల భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంగోపాల్ రావు కూడా వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈయన
వాంగ్మూలం కీలకంగా మారనుందని తెలుస్తోంది. రాంగోపాల్రావు
2005 నుంచి 2008 వరకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేశారు. ఎమ్మార్ గోల్ఫ్కోర్స్కోసం
77.09 ఎకరాల భూసేకరణకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 2000లో మొదటి దశ నోటిఫికేషన్ విడుదల చేసింది.
2002లో మరో
11.26 ఎకరాల సేకరణకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ
11.26 ఎకరాలు కృష్ణ భార్య
విజయనిర్మల పేరు మీద
ఉన్నాయి. కొత్త ప్రాజెక్టుల కోసం భూమి సేకరణ
చేయాలని ఎపిఐఐసి కోరిన
మీదట రెవెన్యూ అధికారులు భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. అనంతరం డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఇచ్చారు. ఆ తర్వాత విజయ నిర్మల, నవీన్
కుమార్, రమానంద్, రవికుమార్లు డిసెంబర్ 2004 నాటి
సిఎంను కలిశారు. తమ భూములకు సేకరణ
నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. వీరికి వైయస్
అభయ హస్తం ఇచ్చారట. సిఎంఓ నుంచి అందిన
ఆదేశాల మేరకే ఆ భూములకు సంబంధించిన డిఎన్, డిడిలపై తదుపరి చర్యలు నిలిపివేసినట్లు రాంగోపాల్ సిబిఐకి వివరించారట.
0 comments:
Post a Comment