హైదరాబాద్:
వరంగల్లు జిల్లాలోని పరకాల శాసనసభా సీటు
నుంచి మాజీ మంత్రి కొండా
సురేఖను గెలిపించుకోవాలనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
వ్యూహం ఫలించేట్లు లేవు. తెలంగాణ రాష్ట్ర
సమితి (తెరాస), ఇతర తెలంగాణవాద పార్టీల
నుంచి పోటీ లేకుండా చూసుకుంటే
పరకాల నుంచి కొండా సురేఖను
గెలిపించుకోవడం సులభమవుతుందని భావించారు. అందుకు ఆయన వ్యూహరచన చేశారు.
అది ఫలించేలా లేదు.
ఇటీవల
ముగిసిన ఉప ఎన్నికల్లో తెలంగాణ
సీట్లలో తన పార్టీ అభ్యర్థులను
వైయస్ జగన్ పోటీకి దించలేదు.
తెలంగాణ కోసం త్యాగాలు చేసినందున
వారిపై పోటీ పెట్టబోమని ఆయన
చెప్పారు. అందుకు అనుగుణంగానే ఆయన పోటీ పెట్టలేదు.
తద్వారా తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించిట్లు
అవుతుందని ఆయన అనుకున్నారు. దాంతో
తెరాస వంటి పార్టీలు పరకాలలో
పోటీకి పెట్టకపోతే సురేఖను గెలిపించుకోవచ్చుననేది ఆయన భావనగా చెబుతున్నారు.
అయితే,
పరకాల సీటును కొండా సురేఖకు అప్పగించడానికి
తెరాస సిద్దంగా లేదు. పరకాలలో తమ
అభ్యర్థిని పోటీకి దించడానికే ఆ పార్టీ సిద్ధపడుతోంది.
తెలంగాణ కోసమే తాను శాసనసభా
సభ్యత్వానికి రాజీనామా చేశానని, అందువల్ల తనపై పోటీ పెట్టకూడదని
సురేఖ చెబుతున్నా తెరాస నాయకులు వినడం
లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాను అనుకూలమని వైయస్
జగన్ పార్లమెంటులో ప్రకటిస్తే సురేఖను తామే గెలిపిస్తామని, లేకుంటే
తాము పోటీకి దిగుతామని తెరాస నాయకులు అంటున్నారు.
మరో వైపు, మహబూబ్నగర్లో తెరాసకు షాక్
ఇచ్చిన బిజెపి పరకాల సీటులో పోటీ
చేయడానికి కదనోత్సహాన్ని ప్రదర్శిస్తోంది. పరకాలలో తాము పోటీ చేస్తామని
బిజెపి నాయకులు అంటున్నారు. తెరాస పోటీకి పెట్టకపోయినా,
బిజెపి రంగంలో ఉంటే కూడా సురేఖ
విజయం కష్టమే అవుతుంది. తెరాస పరకాల సీటును
సురేఖకు గానీ, బిజెపికి గానీ
వదిలేయడానికి సిద్ధంగా లేదు. దీంతో సురేఖను
గెలిపించుకోవడం ఎలా అనేది జగన్కు అంతు పట్టకుండా
ఉంది.
రాష్ట్రంలోని
18 శాసనసభా స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే తెలంగాణలో పరకాల ఒక్కటే ఉంది.
తెలంగాణకు కుంజా సత్యవతి, జయసుధ
మొదట్లో జగన్ వెంటే ఉన్నా,
తర్వాత కాంగ్రెసులోకి తిరిగి వెళ్లిపోయారు. దీంతో జగన్ వెంట
సురేఖ ఒక్కరే నిలిచారు. పైగా, తాను తెలంగాణ
కోసం రాజీనామా చేశానని ఆమె చెబుతున్నారు. వైయస్
జగన్ వెంట నడుస్తూ కూడా
తెలంగాణ కోసమే రాజీనామా చేశాననే
సురేఖ వాదనను తెలంగాణవాదులు కొట్టిపారేస్తున్నారు.
పరకాలలో
సురేఖకు మద్దతిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చిక్కుల్లో పడే అవకాశం కూడా
ఉంది. వైయస్ జగన్తో
కుమ్మక్కయ్యారనే ఆరోపణలు పెరుగుతున్నాయి. తెలంగాణకు అనుకూలంగా జగన్ వైఖరిని ప్రకటించకపోవడం
వల్ల జగన్తో కలిసి
పని చేయడానికి కెసిఆర్కు అవకాశం లేకుండా
పోయింది. పరకాలలో సురేఖపై పోటీకి దిగకపోతే కెసిఆర్ నైతికంగా దెబ్బ తినే అవకాశం
ఉంది. అందువల్ల తెరాస పోటీకే సిద్ధపడుతుందని
చెప్పవచ్చు. ఏమైనా, సురేఖకు పరకాల పోటీ అగ్ని
పరీక్షనే అవుతుంది.
0 comments:
Post a Comment