హైదరాబాద్:
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డిలకు అధిష్టానం నుండి పిలుపు వచ్చింది.
ఈ నెల నాలుగో తేదిన
ఇద్దరూ ఢిల్లీ రావాలంటూ వారిని అధిష్టానం ఆదేశించింది. పిసిసి చీఫ్ బొత్స మధ్యాహ్నం
మాట్లాడుతూ తాను నాలుగో తేదిన
ఢిల్లీ వెళ్లనున్నట్లు చెప్పారు. సిఎం కిరణ్ కూడా
అదే రోజు ఢిల్లీ వెళ్లనున్నారు.
ఇద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు
నెలకొన్న నేపథ్యంలో అధిష్టానమే రంగంలోకి దిగినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే పిసిసి, ముఖ్యమంత్రి
వ్యవహారం పార్టీ పెద్దలను మరింత కలవరపరుస్తోంది.
ఇటీవల
జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెసు
పార్టీ ఘోర వైఫల్యం చెందింది.
అధికారంలో ఉన్న పార్టీ అయి
ఉండి కొన్ని నియోజకవర్గాలలో మూడో స్థానానికి పరిమితమైంది.
ఏ ఒక్క నియోజకవర్గంలో అధికార
పార్టీ అనదగ్గ ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఇందుకు తెలంగాణ సెంటిమెంట్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిపైన ఉన్న సానుభూతి అయినప్పటికీ
సిఎం, పిసిసి చీఫ్ మధ్య ఉన్న
విభేదాల కారణంగా పార్టీ ఘోరమైన వైఫల్యాన్ని చవి చూసిందని పార్టీ
వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు నేతలు ఉప ఎన్నికల
ఫలితాలపై సిఎం, బొత్సలు బాధ్యత
వహించారని, వారి కారణంగానే ఓడిపోయిందని
తప్పు పడుతున్న విషయం తెలిసిందే.
దీంతో
రానున్న ఉప ఎన్నికల్లో కొన్ని
స్థానాల్లోనైనా గెలిస్తే పార్టీ, ప్రభుత్వం పరువు దక్కుతుందని అధిష్టానం
భావిస్తోంది. ఇందుకోసం పార్టీ పెద్దలు మొదట పిసిసి చీఫ్,
సిఎం మధ్య ఉన్న విభేదాలను
పరిష్కరించే దిశలో వారిని ఢిల్లీకి
పిలుపించుకున్నట్లుగా కనిపిస్తోంది. వారి ఇద్దరి మధ్య
విభేదాలు రాష్ట్రంలో పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్న
నేపథ్యంలో వారి మధ్య రాజీ
కుదిర్చే ప్రయత్నాలు చేసేందుకే పిలిచిందని తెలుస్తోంది. మరి అధిష్టానం ప్రయత్నాలు
ఫలిస్తాయో లేదో చూడాలి.
మరోవైపు
ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల అభ్యర్థులపై
ఇరువురితో కలిసి కసరత్తు చేయనున్నారని
తెలుస్తోంది. గెలిచే అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఉప
ఎన్నికల బాధ్యతను ఇరువురు తీసుకోవాలని పిసిసి చీఫ్, సిఎంకు అధిష్టానం
సూచించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్
అభ్యర్థుల కోసం కమిటీ ఏర్పాటును
ముందుకు తీసుకు వచ్చారు.
0 comments:
Post a Comment