హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) దూకుడుగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జీషీట్ దాఖలు చేసిన సిబిఐ మంగళవారం అదనపు ఛార్జీషీట్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సిబిఐ తన అనుబంధ ఛార్జీషీట్లో మరి కొన్ని కంపెనీలు, ప్రభుత్వ అధికారుల పేర్లు పేర్కొనే అవకాశమున్నదని తెలుస్తోంది. ఆదివారం నెక్లెస్ రోడ్డులో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ విడతల వారిగా ఛార్జీషీట్ దాఖలు చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి సంబంధించిన ఓబుళాపురం మైనింగ్ కేసులోనూ సిబిఐ ఇటీవలె శ్రీలక్ష్మీపే ఆదనపు ఛార్జీషీట్ దాఖలు చేసింది. అయితే జగన్ కేసులో మాత్రం మూడు రోజుల్లోనే మరో అదనపు ఛార్జీషీట్ దాఖలు చేయనుండటం విశేషం. కాగా మూడు రెండు రోజుల క్రితం శనివారం సిబిఐ జగన్ కేసులో మొదటిసారి ఛార్జీషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జగన్ను ఎ-1 నిందితుడిగా పేర్కొంటూ ఆ ఛార్జీషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఐఎఎస్ అధికారి బిపి ఆచార్యను కూడా నిందితుడిగా చేర్చింది.
ఎమ్మార్ కుంభకోణం కేసులో కూడా బిపి ఆచార్య నిందితుడు అనే విషయం తెలిసిందే. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్లో 13 మంది పేర్లను నిందితులుగా చేర్చింది. ఈ కేసులో వైయస్ జగన్మోహన్ రెడ్డిని మొదటి నిందితుడిగా చేర్చారు. రెండో నిందితుడిగా జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయిరెడ్డిని చేర్చింది. అరవిందో ఫార్మాను 3వ ముద్దాయిగా, నాలుగో ముద్దాయిగా హెటిరో డ్రగ్స్ను సిబిఐ చేర్చింది. ఐదో ముద్దాయిగా ట్రిడెంట్ను చేర్చింది. ఆరో నిందితుడిగా శ్రీనివాస రెడ్డిని, ఏడో నిందితుడిగా నిత్యానంద రెడ్డిని చేర్చింది.
ఎనిమిదో నిందితుడిగా శరత్ చంద్రా రెడ్డి, తొమ్మిది నిందితుడిగా బిపి ఆచార్యను, పదో నిందితురాలిగా ఇద్దనపూడి విజయలక్ష్మిని, 11వ నిందితుడిగా చంద్రమౌళి, 12వ ముద్దాయిగా జగతి పబ్లికేషన్స్, 13వ ముద్దాయిగా జననీ ఇన్ఫ్రాలను సిబిఐ చేర్చింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో 263 డాక్యుమెంట్లతో 68 పేజీల చార్జిషీట్ను సిబిఐ శనివారం సాయంత్రం ప్రత్యేక కోర్టులో సమర్పించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 66 మంది సాక్షుల వాంగ్మూలాలను సిబిఐ సేకరించింది. కాగా, విజయసాయి రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ను కోర్టు పొడగించింది. ఏప్రిల్ 13వ తేదీ వరకు ఈ రిమాండ్ను కోర్టు పొడగించింది.
0 comments:
Post a Comment