తిరుపతి
మాజీ శాసనసభ్యుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని
కాంగ్రెసు పార్టీలో విలీనం చేసిన తర్వాత రాయలసీమలోని
పిఆర్పీ క్యాడర్ ఆయన వెంట వెళ్లినట్లుగా
కనిపించట్లేదు. చాలామంది మాతృ పార్టీల్లోకి చేరగా
మరికొందరు కొత్త దారి వెతుకున్నారు.
ఇంకొందరు ఎటూ వెళ్లలేక రాజకీయ
అనాథలుగా మిగిలారని అంటున్నారు. చిరంజీవి కాంగ్రెస్లో విలీనమైనప్పటికీ ఈ
విలీనాన్ని స్థానికంగా ఉన్న కాంగ్రెస్ క్యాడర్
ఆహ్వానించక పోవడం కారణంగానే రాయలసీమలోని
జిల్లాల్లో పూర్వపు పిఆర్పీ శ్రేణుల్లో చాలామంది ఆ పార్టీలో ఇమడలేక
పోయారని అంటున్నారు. రాయలసీమ జిల్లాల్లోని చాలా నియోజకవర్గాల్లో చిరంజీవి
సామాజిక వర్గానికి, కాంగ్రెస్ వర్గాలకు మధ్య కొన్ని దశాబ్దాలుగా
మంచి సంబంధాలు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని
అంటున్నారు. అందువల్లే కాంగ్రెస్లో చిరంజీవి విలీనమైనంత
సులభంగా ఆయన క్యాడర్ విలీనం
కాలేక పోయిందంట. ఒకవేళ కాంగ్రెస్లో
మమేకమయ్యేందుకు చిరు క్యాడర్ ప్రయత్నించినా
అనేక జిల్లాల్లో కాంగ్రెస్ వర్గాలు వీరిని ద్వితీయ పౌరులుగానే చూస్తున్నారట. ఫలితంగా అత్మాభిమానం చంపుకొని కాంగ్రెస్లో ఇమడలేక పూర్వపు
పిఆర్పీ నేతలు, కార్యకర్తలు ఒకనాటి తమ మాతృ పార్టీల
వైపు అడుగులు వేస్తున్నారని అంటున్నారు.
చిరంజీవి
ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన తిరుపతి ఉన్న చిత్తూరు జిల్లా
విషయానికి వస్తే ఇక్కడ పిఆర్పీ
జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన జంగాలపల్లె శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. తిరుపతిలో చిరంజీవి గెలుపునకు కృషి చేసిన మాజీ
ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. జిల్లాలో చిరంజీవికి సన్నిహితంగా వ్యవహరించిన మరో బలమైన నాయకుడు
ఆదికేశవులు.. ఈయన తనయుడు శ్రీనివాస్
2009 ఎన్నికల్లో పిఆర్పీ అభ్యర్థిగా రాజంపేట లోక్సభా స్థానం
నుంచి పోటీ చేశారు. ఈ
కుటుంబం ఇప్పుడు టిడిపిలోకి వెళ్లబోతోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆదికేశవులు మాత్రం
దానిని ఖండించినట్లుగా తెలుస్తోంది. తాను కాంగ్రెసులో ఉంటానని
చెప్పినట్లు సమాచారం. వాస్తవానికి ఈ ముగ్గురు చిరంజీవి
సామాజికవర్గానికి చెందిన వారవడమే కాకుండా ఆయన పట్ల అభిమానంతో
తెలుగుదేశం పార్టీని వదిలి పిఆర్పీలో చేరినవారే.
చిరంజీవితో రాజకీయ పయనం చేయలేక పోతున్నారని
అంటున్నారు.
ఇక
2009 ఎన్నికల్లో పిఆర్పీ అభ్యర్థులుగా పోటీ చేసిన చాలామంది
ఎప్పుడో అంతర్థానమయ్యారు. తిరుపతిలో కొంతమంది మిగిలినా వారు మెహమాటానికి మాత్రమే
చిరంజీవి వర్గంగా కొనసాగుతున్నారట. తిరుపతి ఉప ఎన్నికల నోటిఫికేషన్
విడుదలయ్యే నాటికి కాంగ్రెస్లో వీరు నిలబడతారనే
గ్యారంటీ లేదని అంటున్నారు. ఇక
జగన్ సొంత జిల్లా కడప
విషయానికి వస్తే పిఆర్పీ ఆవిర్భావ
సమయంలో చిరంజీవి వెంట వచ్చిన జిల్లా
ప్రముఖుల్లో మంత్రి రామచంద్రయ్య ఒక్కరే ఇప్పుడు కాంగ్రెస్లో మిగిలారు. ఆయన
కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పటికీ అసంతృప్తితో ఉన్నట్లు ఇటీవల ఆయన చేసిన
వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. మాజీ
మంత్రి బ్రహ్మయ్య, మాజీ ఎంపి గునిపాటి
రామయ్య టిడిపిలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని
తెలుస్తోంది. వీరిద్దరు చిరు సామాజిక వర్గానికి
చెందిన వారు కావడం గమనార్హం.
ఇక మాజీ మంత్రి ఖలీల్
బాషా కూడా తన పూర్వ
పార్టీ టిడిపి వైపు చూస్తున్నారని అంటున్నారు.
అనంతపురం జిల్లాలో చిరంజీవి సామాజికవర్గానికి చెందిన ప్రకాశ్ పిఆర్పీతో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. అది కాంగ్రెస్లో
విలీనం కావడంతో ఆయన దిక్కుతోచని పరిస్థితి
ఎదుర్కొంటున్నారట. గత ఎన్నికల్లో పిఆర్పీ
తరఫున తాడిపత్రి నుంచి పోటీ చేసిన
పైలా నరసింహయ్య, హిందూపురం ఎంపిగా, అనంతపురం నుంచి పోటీ చేసిన
తదితరులు ఇప్పటికే రాజకీయాలకు దూరమయ్యారట.
కర్నూలు
జిల్లాలో భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి
ఇప్పటికై జగన్ స్థాపించిన వైయస్సార్
కాంగ్రెసు పార్టీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో ఈ
జిల్లాకు చెందిన 14 నియోజకవర్గాల నుంచి పిఆర్పీ అభ్యర్థులుగా
పోటీ చేసిన వారందరూ రాజకీయంగా
కనుమరుగయ్యారట. ఇలా పలువురు నేతలు
ఇప్పటికే చిరంజీవితో కలిసి కాంగ్రెసు నావలో
సాగేందుకు వెనక్కి వెళ్లారు. మరి ఓటర్ల తీరు
కూడా అలాగే ఉంటుందా అనే
సంశయం ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. యువకులు, మహిళలు చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని ఊహించుకొని ఓటు వేశారు. మరి
ఇప్పుడు కాంగ్రెసుకు ఓటు వేయమని చిరంజీవి
చెబితే వారు వేస్తారా అనేది
అసలు ప్రశ్న. అయితే చిరంజీవి కోసం
పిఆర్పీకి ఓటేసిన వారిలో చాలామంది ఇప్పుడు ఆయన చెప్పారని కాంగ్రెసుకు
ఓటేసే అవకాశాలు లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు.
0 comments:
Post a Comment