హైదరాబాద్: దివంగత నేత
వైయస్ రాజశేఖర రెడ్డిపై వ్యాఖ్యలు చేసే విషయంలో మంత్రి కొండ్రు మురళి
వెనక్కి తగ్గలేదు. మరోసారి వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా వైయస్ ఉన్నప్పుడు దళితులకు ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదని ఆయన శనివారం అన్నారు. అప్పుడు వైయస్
తీసుకున్న పలు నిర్ణయాల వల్ల దళితులు దాదాపు మూడు వేల కోట్ల
రూపాయలు నష్టపోయారని ఆయన
అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల దళితులకు ఎక్కడా మేలు జరగలేదని ఆయన
అన్నారు. కాంగ్రెసు పథకాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్
తన సొంత పథకాలుగా ప్రచారం చేసుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్
ప్రణాళిక నిధుల సక్రమ
వినియోగానికి తాజాగా ఏర్పాటైన మంత్రి వర్గ ఉప సంఘం వల్లనే దళితులకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. దళితులకు జరుగుతున్న అన్యాయాలపై ఎన్నిసార్లు చెప్పినా వైయస్ పట్టించుకోలేదని, వైయస్ చేసిన అన్యాయంపై ప్రజలకు వివరిస్తానని ఆయన
అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి దళితులకు చేసిందేమీ లేదని
ఆయన ఇటీవల ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో చేసిన విమర్శ తీవ్ర వివాదానికి దారి
తీసింది. కాంగ్రెసు పార్టీ నాయకులు రెండుగా విడిపోయారు. వైయస్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయి వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు దానికి తోడు, వైయస్ను దళిత వ్యతిరేకంగా వ్యాఖ్యానించే నాయకుల సంఖ్య
పెరుగుతూ వస్తోంది. కొండ్రు మురళి తీరుపై మరో
మంత్రి వట్టి వసంతకుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు.
వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించకూడదని ముఖ్యమంత్రి మంత్రులకు సూచించినట్లు వార్తలు వచ్చాయి. వైయస్ రాజశేఖర రెడ్డి పట్ల అనుసరించాల్సిన వైఖరిపై తాను స్పష్టత ఇస్తానని కూడా చెప్పారు. కానీ
ఆయన ఇప్పటి వరకు
స్పష్టత ఇవ్వలేదు. పైగా
వైయస్పై నాయకులు విమర్శలు పెరిగాయి. కొండ్రు మురళి తన వైఖరిని వీడలేదు.
వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల దళితులకు ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదని కాంగ్రెసులోని దళిత నాయకులు విమర్శలు చేస్తున్నారు. దళితులకు వైయస్
రాజశేఖర రెడ్డి అన్యాయం చేశారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ విమర్శించారు. కేంద్ర మంత్రి పనబాక
లక్ష్మి కూడా వైయస్
వ్యతిరేక లాబీలో చేరిపోయారు. వైయస్ వల్ల దళితులకు ప్రయోజనం చేకూరలేదని ఆమె
అన్నారు.
0 comments:
Post a Comment