తెలంగాణ
రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల మధ్య
దూరం పెరుగుతోంది. తెరాస ఆధిపత్యంగా ఉన్న
తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి
నుండి బిజెపి ఏ క్షణం నుండైనా
బయట పడవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. జెఏసిలో తొలి నుండి తెరాస
ఆధిపత్యంపై బిజెపి పలుమార్లు సమావేశాలలో, బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే మహబూబ్నగర్లో బిజెపి గెలుపు
తర్వాత వారి మధ్య దూరం
మరింత పెరిగిందనే చెప్పవచ్చు.
ఇటీవలి
కాలంలో తెరాస, బిజెపి బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నాయి. కాంగ్రెసు ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేస్తున్నప్పుడు బిజెపి నోరు మెదపలేదని, అధికార
పార్టీకి మద్దతిచ్చిందన్న అంశంపై బిజెపి తీవ్రస్థాయిలో మండిపడింది. బుధవారం ఆ పార్టీ అధ్యక్షుడు
కిషన్ రెడ్డి తెరాసపై నిప్పులు చెరిగారు. కాంగ్రెసు కండువా కప్పుకున్నది మీరని, మంత్రి పదవులు తీసుకుంది మీరని ఎదురు దాడి
చేశారు. కాంగ్రెసుతో కుమ్మక్కయ్యే అవకాశవాదం మాకు లేదన్నారు.
కాంగ్రెసు
పార్టీ ఎంపీలు చేస్తున్న డ్రామాలో మేం పాలు పంచుకోసమని,
అసలు తెరాసకు తెలంగాణ కావాలా వద్దా తేల్చుకోవాలని సూచించారు.
మమ్మల్ని విమర్శించే నైతిక అర్హత లేదన్నారు.
ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు పాలమూరులో
బిజెపి గెలుపు తర్వాత కాస్త బయటకు వచ్చాయి.
తాజాగా తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీ సస్పెన్షన్ అంశంతో
లావాలా పెల్లుబుకాయి.
తమకు
ప్రత్యామ్నాయంగా తెలంగాణలో బిజెపి ఎదగడం తెరాసకు ఇష్టం
లేకపోవడం, తమను ఓ వర్గానికే
పరిమితం చేసేలా తెరాస ప్రచారం చేయడం
బిజెపికి రుచించక పోవడమే ఇరు పార్టీల మధ్య
విభేదాలు తారాస్థాయికి చేరడానికి కారణం. ఈ నేపథ్యంలో తెరాస
ఆధిపత్యంలో ఉన్న జెఏసిలో నుండి
బిజెపి ఎప్పుడైనా బయట పడవచ్చునని అంటున్నారు.
మొదటి
నుంచి తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న తమను
కాదని, ఇప్పుడు కాంగ్రెస్ వైపు మళ్లడమేమిటంటూ బిజెపి
తెరాసను ప్రశ్నిస్తోంది. మహబూబ్నగర్ ఎన్నికతో టిఆర్ఎస్కు భయం పట్టుకుందని
బిజెపి బహిరంగంగానే చెబుతోంది. తెలంగాణలో బిజెపి బలపడితే తమ ఉనికికి ఎక్కడ
భంగం కలుగుతుందోనన్న భయంతోనే తమ పార్టీని విమర్శిస్తున్నారని
దుయ్యబడుతున్నారు. గడచిన రెండు రోజుల్లో
ఈ విమర్శల పదును పెరిగి తారస్థాయికి
చేరుకున్నాయి.
త్వరలో
జరగనున్న పరకాల ఎన్నికలోనూ రెండు
పార్టీలూ పోటీ పడుతున్న నేపథ్యంలో
అవి జెఏసిలో కలిసి ఉండడం సాధ్యమేనా
అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ జెఏసిలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న
బిజెపి ఇకపై అలాంటి అవమానాలను
ఎదుర్కొనడానికి సిద్ధంగా లేదని అంటున్నారు. జెఏసిలో
ఉండి అవమానాలు ఎదుర్కొనేకంటే ఒంటరిగా ఉద్యమించాలని చూస్తున్నారని అంటున్నారు.
పార్టీ
ప్రాభవం పెరుగుతుందంటూ చాలామంది బిజెపి నేతలు అభిప్రాయపడుతున్నారు. జిల్లా శ్రేణుల
నుంచి కూడా ఇలాంటి అభిప్రాయాలే
వ్యక్తమవుతున్నాయి. కేంద్ర నాయకత్వం కూడా ఒంటరి పోరుకే
వత్తాసు పలుకుతోంది. తద్వారా పార్టీని బలోపేతం చేసుకోవడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో బిజెపి కీలక పాత్ర పోషించినట్లవుతుందన్నది
జాతీయ స్థాయి నేతలు కూడా అభిప్రాయపడుతున్నారట.
దీంతో బిజెపి ఒంటరిగా ఉద్యమించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
0 comments:
Post a Comment