హైదరాబాద్:
ప్రభుత్వం కోసం, నాయకుడు చెప్పారని
ఫైళ్లపై సంతకాలు చేస్తే మమ్మల్ని బలి చేస్తారా అని
మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని
ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. మోపిదేవి వెంకట రమణ అరెస్టు
కావడంతో ముఖ్యమంత్రి నివాసంలో గురువారం రాత్రి మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు
సిఎంకు పలు ప్రశ్నలు సంధించారని
తెలుస్తోంది. నాయకుడు చెప్పారని ఫైళ్లపై సంతకాలు చేస్తే మాకు ఒరిగిందేమిటని, మాకు
వ్యక్తిగతంగా కలిగిన ప్రయోజనం ఏమిటని వారు సిఎంను అడిగారు.
వివిధ
ఫైళ్లపై మేం చేసిన సంతకాలతో
ఎవరికి లబ్ధి చేకూరిందన్నదే సిబిఐ
చూడాలి తప్ప.. నాయకుడి సూచన మేరకు సంతకాలు
చేసినందుకే ఇంత తీవ్రమైన చర్యలు
తీసుకుంటుందా అని ప్రభుత్వ విచక్షణని,
అధికారాన్ని కూడా సిబిఐ ప్రశ్నిస్తుందని
వారు సిఎం దృష్టికి తీసుకు
వెళ్లారని తెలుస్తోంది. రోజుకో మంత్రిని అరెస్టు చేసుకుంటే పోతే ప్రభుత్వానికి నష్టమే
అని పలువురు మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి దామోదర
రాజనరసింహ, మంత్రులు బొత్స సత్యనారాయణ, గీతారెడ్డి,
సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, దానం నాగేందర్, వట్టి
వసంత కుమార్, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ కుమార్ రెడ్డి,
దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పార్థసారధి, కాసు
వెంకట కృష్ణారెడ్డి హాజరయ్యారు. సబిత, గీతా రెడ్డి,
పొన్నాల లక్ష్మయ్యలు సిఎంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశంలో.. కేబినెట్ సహచరుడైన మోపిదేవి అరెస్టు బాధాకరమని ముఖ్యమంత్రి అన్నారు.
అధికారులను
సిబిఐ విచారణ కోసం పిలిచినప్పుడు వారిని
అరెస్టు చేస్తారో లేదో అనే అంశంపై
అంచనాకు వచ్చే అవకాశం ఉండిందని,
కానీ... మోపిదేవి విషయంలో అలా జరగలేదని సిఎం
అన్నారని తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగానే పిలిచి అరెస్టు చేశారని, ఇది తాను కూడా
ఊహించలేదన్నారు. సిబిఐ ప్రభుత్వ నియంత్రణలో
లేదన్నారు. బొత్స కూడా మోపిదేవి
అరెస్టు బాధాకరమన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని నమ్ముకుని బలైపోయారని, ఉప ఎన్నికలు జరుగుతున్న
కీలక సమయంలో మోపిదేవి అరెస్టు పార్టీకి, ప్రభుత్వానికి నష్టమే అని ఆందోళన వ్యక్తం
చేశారు.
కేబినెట్
నిర్ణయాలకు సమిష్ఠి బాధ్యత తీసుకోవాల్సిందేనని, కానీ తెరవెనుక లావాదేవీలకు
ఎవరికి వారే బాధ్యత వహించాలని
పునరుద్ఘాటించారు. ఈ సమయంలో మంత్రి
దానం నాగేందర్ జోక్యం చేసుకుని... పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలులో
ఉన్నదేనని, రాయితీలు ఇచ్చిన మంత్రులందరినీ అరెస్టు చేస్తూ పోతే ప్రభుత్వానికి నష్టమే
అని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలాంటి
విషయంలో ముఖ్యమంత్రి మంత్రులకు బాసటగా నిలవాలని కోరారు. మోపిదేవిని అరెస్టు చేయడం వల్ల ఆయా
సామాజిక వర్గాల్లో అసంతృప్తి నెలకొంటోందని అన్నారు. మోపిదేవి అరెస్టుకూ, సామాజికవర్గానికి ఎలాంటి సంబంధం లేదని కిరణ్ స్పష్టం
చేశారు. ఆరుగురు మంత్రులకు సుప్రీం కోర్టు జారీ చేసిన నోటీసులకు
ప్రభుత్వమే సమర్థంగా సమాధానం ఇవ్వాల్సిన అవసరముందన్నారు. తమ ఇంటి ముందు
రోజూ ఓబీ వ్యాన్లు పెట్టడం
ఆవేదన కలిగిస్తోందని సబిత వాపోయినట్లుగా తెలుస్తోంది.
వాట్
నెక్స్ట్ అంటూ కథనాలు ప్రచరించడం
వల్ల వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతింటోందని రాజనరసింహ అన్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో సిబిఐ అతి జోక్యం
సరికాదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మీడియాలో
మమ్మల్ని అరెస్టు చేస్తారంటూ కథనాలు రాస్తున్నారని, దీనిని చూస్తుంటే బాధేస్తుందని ముఖ్యమంత్రి ముందు సబిత, గీతారెడ్డి,
పొన్నాల వాపోయారు. మిగిలిన మంత్రులు వెళ్లిన అనంతరం.. వీరు విడిగా సిఎంతో
సమావేశమయ్యారు.
విధానపరమైన
నిర్ణయాలలో భాగంగానే ఫైళ్లపై సంతకాలు చేశామని, ఇప్పుడు దానిని అనుమానిస్తున్నారని, తన ఆస్తులపై దర్యాప్తు
చేసుకోవచ్చునని సబిత పేర్కొన్నారు. విధానపరమైన
నిర్ణయాలు తీసుకుని ఇప్పుడు సంజాయిషీ చెప్పుకోవాల్సి రావడంపై గీతా రెడ్డి, పొన్నాల
కూడా ఆవేదన వ్యక్తం చేశారు.
వాస్తవ విషయాలను అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్తానని వారికి సిఎం హామీ ఇచ్చారు.
0 comments:
Post a Comment