హైదరాబాద్:
కర్ణాటక మాజీ మంత్రి గాలి
జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి టి.
పట్టాభి రామారావుపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి
ఆరోపణలు రావడంతో హైకోర్టు గురువారం ఆయనను సస్పెండ్ చేసింది.
గనుల అక్రమ తవ్వకాల కేసులో
తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కుంటున్న గాలి జనార్దన్ రెడ్డికి
హైదరాబాదులోని సిబిఐ కేసుల మొదటి
అదనపు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి టి. పట్టాభి రామారావు
మే 12వ తేదీన బెయిల్
మంజూరు చేసిన విషయం తెలిసిందే.
కేసులో
కోట్లాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు రావడంతో సిబిఐ ఫిర్యాదు మేరకు
హైకోర్టు పట్టాభిరామారావును సస్సెండ్ చేసినట్లు తెలుస్తోంది. న్యాయమూర్తికి చెందిన బ్యాంకు లాకర్లను కూడా సోదా చేసి
పెద్ద మొత్తంలో సొమ్ము కనుగొన్నట్లు సమాచారం. అయితే, హైకోర్టు జారీ చేసిన పత్రికా
ప్రకటనలో మాత్రం - ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన
సమాచారం మేరకు, ప్రజాహితం దృష్ట్యా అత్యవసరంగా సస్పెండ్ చేసినట్లు తెలిపింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఇంచార్జీ రిజిస్ట్రార్ (విజిలెన్స్) పి. మస్తానమ్మ ఈ
మేరకు ఒక ప్రకటన విడుదల
చేశారు.
పట్టాభిరామారావుపై
క్రమశిక్షణా చర్యలు తీసుకునే ప్రక్రియ ముగిసేవరకు సస్పెన్షన్ ఉత్తర్వులు అమలులో ఉంటాయని ఆ ప్రకటనలో తెలిపారు.
హైకోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కూడా ఆదేశించినట్లు సమాచారం.
జడ్జి పట్టాభిరామారావుపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు
నమోదుకు కూడా సీబీఐకి హైకోర్టు
అనుమతి ఇచ్చినట్టు తెలిసింది.
నేరం
రుజువైతే పట్టాభిరామారావు తన జడ్జి పదవిని
కోల్పోయే అవకాశాలున్నాయి. సిబిఐ కోర్టు జడ్జిగా
బాధ్యతలు స్వీకరించి రెండు నెలలైనా కాకమునుపే
పట్టాభిరామారావు అవినీతి బాగోతం బయటపడడం గమనార్హం. అనుమానాస్పద తీర్పులు ఇచ్చిన జడ్జిలపై సస్పెన్షన్ వేటు పడటం తరచూ
జరుగుతూనే ఉంటుంది. కానీ... లంచం, అవినీతి ఆరోపణలపై
సస్పెండ్ అయిన జడ్జిల సంఖ్య
మాత్రం తక్కువే. గతంలో ఏలేరు కుంభకోణం
కేసులో పి.స్వామి అనే
సబ్ జడ్జి అవినీతికి పాల్పడినట్లు
రుజువు కావడంతో హైకోర్టు ఆయనను డిస్మిస్ చేసింది.
0 comments:
Post a Comment