వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ ఉచ్చు బిగించే
కొద్ది.. మేళ్ల జివోలతో సంబంధమున్న
మంత్రులు, అధికారులలో టెన్షన్ పెరుగుతోంది. అరెస్టు ప్రచారం వీరందరినీ కలవర పెడుతోందని తెలుస్తోంది.
ఆస్తుల విషయంలో అధికారులు చేయించిన వారిని వదిలేసి మమ్మల్ని ప్రశ్నించడమేమిటని చెబుతుండగా, తమకు ఆ పాపంతో
సంబంధం లేదని మంత్రులు చెబుతున్నారు.
తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నప్పటికీ అందరిలోనూ
ఆందోళన కనిపిస్తోందని అంటున్నారు.
ఈ కేసులో ఎప్పుడు ఎవరు అరెస్టు అవుతారో
తెలియక, ఎప్పుడు ఎవరికి పిలుపు అందుతుందో అర్థం కాక అందరిలోనూ
టెన్షన్ కనిపిస్తోందని అంటున్నారు. జగన్ అక్రమాస్తుల కేసు
సున్నితమైన వ్యవహారం కావడంతో సిబిఐ, ప్రభుత్వం గోప్యత పాటిస్తున్నట్లుగా కనిపిస్తోంది. జగన్ మీడియా ఆస్తుల
జప్తు జీవోలో ఏముందో, అటాచ్మెంట్ జాబితాలో
ఏయే ఆస్తులను చేర్చారో ఎవరికీ తెలియకపోవడం, సంబంధిత ఫైల్పై హోం
మంత్రి సబితా ఇంద్రా రెడ్డి,
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
సంతకాలు చేసిన విషయం ఎవరికీ
తెలియకపోవడం గోప్యత పాటిస్తున్నారనేందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
ఈ నేపథ్యంలో అసలేం జరుగుతోంది? అనే
విషయం మంత్రులకూ తెలియడం లేదట. పైగా వారిని
అరెస్టు చేస్తారని, వీరిని అరెస్టు చేస్తారని,సిబిఐ పిలుపు అందనుందంటూ
మీడియాలో జరుగుతున్న ప్రచారం మరింత గందరగోళానికి దారి
తీస్తోందని తెలుస్తోంది. సిబిఐ కూడా అనూహ్యమైన
నిర్ణయాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీంతో మంత్రులకే ముచ్చెమటలు
పడుతున్నాయట. ఈ విషయమై మంత్రులు,
అధికారులు ఏం జరుగుతోందని తమకు
తెలిసిన వారి ద్వారా ఆరా
తీస్తున్నారట.
జగన్
కేసులో ఇప్పటికే మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి,
మోపిదేవి వెంకట రమణ, ధర్మాన
ప్రసాద రావును సిబిఐ ప్రశ్నించింది. మోపిదేవి
సోమవారం మరోమారు సిబిఐ ఎదుట హాజరుకానున్నారు.
ధర్మాన, సబితను కూడా మరోసారి ప్రశ్నించే
అవకాశముందని తెలుస్తోంది. మూడు రోజుల క్రితం
సబితా ఇంద్రా రెడ్డిని సిబిఐ గోప్యంగా విచారించిందని,
ఆమె అరెస్టు జరగవచ్చుననే ప్రచారం జోరుగా జరిగింది. జగన్ మీడియాకు ప్రకటనలు
గుప్పించిన సమయంలో సమాచార మంత్రులుగా ఉన్న ఆనం రామనారాయణ
రెడ్డి, గీతా రెడ్డిని కూడా
ప్రశ్నించే అవకాశమున్నట్లుగా చెబుతున్నారు.
సిబిఐ
నుంచి తనకు పిలుపు అందితే
వెళతానని, అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తానని మరో మంత్రి పొన్నాల
లక్ష్మయ్య తెలిపారు. ఏది ఏమైనా జగన్ను అరెస్టు చేసేలోగా
ఒకరిద్దరు మంత్రులను సిబిఐ అదుపులోకి తీసుకునే
అవకాశాలను కొట్టి పారేయలేమని అధికార పార్టీలో కూడా చర్చ జరుగుతోందట.
కేంద్రం స్థాయిలో కామన్వెల్త్ క్రీడల కుంభకోణంలో సురేశ్ కల్మాడీ, 2జీ కేసులో భాగస్వామ్య
పక్షమైన డిఎంకే మంత్రి రాజా, ఎంపి కనిమొళి
తదితరులపై చర్యలు తీసుకున్న సంగతి గుర్తు చేస్తున్నారు.
అదే సమయంలో... సెమీ ఫైనల్స్ తరహాలో
18 శాసనసభ, ఒక లోక్సభ
నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న
తరుణంలో సొంత మంత్రులనే అరెస్టు
చేయడం ఆత్మహత్యా సదృశమని కూడా నేతలు వాదిస్తున్నారట.
మొత్తంగా మంత్రుల అరెస్టు పాలనపరంగా, రాజకీయంగా మరింత అనిశ్చితికి దారి
తీయడం ఖాయమని అందరూ స్పష్టం చేస్తున్నారు.
జగన్ అక్రమాస్తుల కేసులో అధికారులూ, మంత్రులూ సంకట స్థితిలో చిక్కుకుని
తమకేం జరుగుతుందో అనే ఆందోళనలో పడిపోయి,
పాలనపై దృష్టిపెట్టలేక పోతున్నారని అంటున్నారు.
ఒఎంసి,
ఎమ్మార్ కేసుల్లో ఐఏఎస్లు శ్రీలక్ష్మి,
ఆచార్య, ఎల్వీ సుబ్రమణ్యం ప్రాసిక్యూషన్కు అనుమతించాల్సిందిగా సిబిఐ కోరిన
సంగతి తెలిసిందే. జగన్ అక్రమాస్తుల కేసులోనూ
ఇలాగే కొందరిపై చర్యలకు అనుమతి అడిగే అవకాశముంది. ఇది
సర్కారుకు అగ్ని పరీక్షలా మారిందనే
చెప్పవచ్చు.
ప్రాసిక్యూషన్కు అనుమతిస్తే సొంత
అధికారులనే బోనులో నిలబెట్టినట్లవుతుందని, ఐఏఎస్ల ఆగ్రహానికి
గురికావాల్సి వస్తుందని, ఇవ్వకపోతే కోర్టులోనే సిబిఐ సర్కారును కడిగేస్తుందనే
అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు జగన్ను మాత్రమే
టార్గెట్ చేశారని, తప్పులు చేసిన తమ వాళ్లను
వదిలేశారనే సంకేతాలూ ప్రజల్లోకి వెళతాయనే ఆందోళన వ్యక్తమవుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎటూ
పాలుపోక సర్కారు తలపట్టుకుంటోందట.
0 comments:
Post a Comment