ఉప ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెసు
పార్టీలో విభేదాలు బహిర్గతమవుతున్నాయని అంటున్నారు. పార్టీకి జీవన్మరణ సమస్యగా మారిన ఎన్నికలకు కొద్ది
రోజుల ముందు ఇలా అసంతృప్త
వర్గాలు బయట పడటం ముఖ్య
నేతలకు మింగుడు పడటం లేదని అంటున్నారు.
పార్టీ గెలుపోటములపై దీని ప్రభావం పడుతుందని
వారు ఆందోళన చెందుతున్నారట. అయినప్పటికీ పార్టీ నేతల మధ్య వర్గపోరు
మాత్రం పెరుగుతోందనే ప్రచారం జరుగుతోంది.
జగన్
కోటరీలోని కొందరు నేతల వ్యవహారశైలి పైన
పార్టీలోని సీనియర్ నేతలతో సహా, మరికొందరు నేతలు
అసంతృప్తితో రగిలిపోతున్నారని అంటున్నారు. జగన్ పార్టీ అధికార
ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు ఉదంతం పార్టీలో
వర్గ విభేదాలకు నిదర్శనంగా నిలుస్తోందని అంటున్నారు. జూపూడిది ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలోని సంకువారికుంట గ్రామం. శనివారం జగన్ ఆ గ్రామం
మీదుగా ప్రచారం నిర్వహించారు.
అయితే
జగన్ సొంత గ్రామానికి వస్తున్నప్పటికీ
కనీసం తనకు మాటమాత్రమైనా మాజీ
మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పక పోవడం, ప్రచార కార్యక్రమాలను సమన్వయం చేస్తున్న వైవి సుబ్బారెడ్డి కూడా
ఈ సమాచారం అందించక పోవడంపై జూపూడి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట.
తమ మధ్య ఉన్న విభేదాల
కారణంగానే ఉప ప్రచారంలో జూపూడిని
బాలినేని దూరం పెడుతున్నారనే వాదనలు
వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే జూపూడి
జగన్ ప్రచారానికి దూరంగా ఉన్నారని అంటున్నారు.
జగన్
కోటరీలోని ముఖ్యనేతల వల్లే ఈ పరిస్థితి
తలెత్తుతోందని జూపూడితో పాటు పార్టీలోని కొందరు
అసంతృప్త నేతలు భావిస్తున్నారట. గతంలో
వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి కూడా తమ జిల్లాలలో
ఇతర సామాజిక వర్గానికి చెందిన మరో నేతకు ఇచ్చిన
గుర్తింపు, తమకు లేకుండా పోయిందని
ఆమె కాంగ్రెసు పార్టీలోకి వెళ్లి పోయారు. అయితే ఇలా దళిత
నేతలు అసంతృప్తి చెందితే పార్టీలో ఆ సామాజిక వర్గానికి
ప్రాధాన్యత లేదనే తప్పుడు సంకేతాలు
ప్రజల్లోకి వెళతాయనే ఆందోళన ఆ పార్టీలో ఉందని
అంటున్నారు.
పార్టీ
కేంద్ర పాలక మండలి సభ్యుడు
వైవి సుబ్బారెడ్డి, సాక్షి పత్రికలో పని చేస్తున్న మరొకరు
వైయస్సార్ కాంగ్రెసులో కీలకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. పార్టీ వ్యవహారాలు దాదాపుగా వీరిద్దరే చూసుకుంటారట. వీరితో పాటు బాలినేని శ్రీనివాస్
రెడ్డి, తెంగాణకు చెందిన మరో సీనియర్ నేత,
విశాఖకు చెందిన మరో నేత జగన్
కోటరీగా ఏర్పడ్డారని అంటున్నారు. వారి వైఖరి కారణంగా
పార్టీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయని అంటున్నారు.
పార్టీ అధికార ప్రతినిధులు కూడా అసంతృప్తితో ఉన్నారని
అంటున్నారు.
0 comments:
Post a Comment